టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఆదివారం సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన సొంత నియోజకవర్గం కుప్పంలో పార్టీ వ్యవహారాలను ఇకపై తానే చూసుకుంటానంటూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా కుప్పంలో పార్టీ వ్యవహారాలను పర్యవేక్షిస్తున్న ఎమ్మెల్సీ శ్రీకాంత్ ను ఆ బాధ్యతల నుంచి తప్పిస్తూ బాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు నా కుప్పం… నేనే చూసుకుంటాను అంటూ బాబు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
కుప్పం ప్రజలు చంద్రబాబును గడచిన 40 ఏళ్లుగా ఎమ్మెల్యేగా గెలిపిస్తూనే వస్తున్నారు. కుప్పం నుంచి గెలిచాకే ఆయన సీఎంగా, ప్రధాన ప్రతిపక్ష నేతగా, దేశ రాజకీయాల్లో చక్కం తిప్పే నేతగా ఆయన ఎదిగారు. అయితే సీఎంగా ఉండగా ప్రజా పాలన, ప్రతిపక్ష నేత హోదాలో పార్టీ వ్యవహారాల పర్యవేక్షణ నేపథ్యంలో తరచూ కుప్పం వెళ్లడం చంద్రబాబుకు సాధ్యం కావడం లేదు. ఈ కారణంగానే ఆయన కుప్పం పార్టీ బాధ్యతలను ఎవరికో ఒకరికి అప్పగిస్తూ వస్తున్నారు. ఎన్నికల సమయంలో కూడా చంద్రబాబు కుప్పంను టచ్ చేయకుండా సాగినా… ఆయనను మాత్రం అక్కడి ప్రజలు గెలిపిస్తూనే వస్తున్నారు.
తాజాగా 2024 ఎన్నికల్లో మరోమారు అధికారం అందుకున్న చంద్రబాబు… కుప్పంలో పార్టీ వ్యవహారాల పర్యవేక్షణకు ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ కు అప్పగించారు. ఈ క్రమంలో అనంతపురం జిల్లాకు చెందిన శ్రీకాంత్… తరచూ కుప్పం వెళ్లి అక్డకి టీడీపీ వ్యవహారాలను చూస్తున్నారు. అయితే దూరాభారమో, లేదంటే స్థానికేతరుడన్న భావనో తెలియదు గానీ… శ్రీకాంత్ వ్యవహారం పట్ల కుప్పం స్థానిక నేతల్లో ఓ మోస్తరు అసంతృప్తి ఉన్నట్లు సమాచారం. ఈ కారణంగానే శ్రీకాంత్ ను కుప్పం బాధ్యతల నుంచి చంద్రబాబు తప్పించినట్లుగా సమాచారం.
కుప్పం టీడీపీ నేతలతో ఆదివారం చంద్రబాబు అమరావతిలో నిర్వహించారు. ఈ సమావేశానికి కుప్పం స్తానిక పార్టీ నేతలతో పాటుగా నియోజకవర్గ పార్టీ ఇంచార్జీ హోదాలో శ్రీకాంత్ కూడా పాలుపంచుకున్నారు. సమావేశంలో శ్రీకాంత్ ప్రసంగం పూర్తి అయిన వెంటనే చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. కుప్పం నా నియోజకవర్గం… ఇకపై అన్నీ నేనే చూసుకుంటా అని చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బాబు నోట నుంచి ఈ తరహా మాటలు విన్నంతనే శ్రీకాంత్ తో పాటు సమావేశానికి హాజరైన వారంతా షాక్ తిన్నారని చెప్పాలి.
అయితే పరిస్థితిని చల్లబరిచే క్రమంలో ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నానన్న విషయాన్ని చంద్రబాబు వివరించారు. ప్రజా ప్రతినిధులు… ప్రత్యేకించి నామినేటెడ్ పదవుల్లో ఉన్నవారు వారికి సంబంధించిన శాఖల బాధ్యత చూడాల్సి ఉందని ఆయన పేర్కొన్నారు. ఈ కారణంగానే శ్రీకాంత్ ను కుప్పం బాధ్యతల నుంచి తప్పిస్తున్నామని చెప్పారు. పార్టీకి సంబంధించి రాష్ట్ర స్థాయిలో శ్రీకాంత్ సేవలను వినియోగించుకుంటామని ఆయన తెలిపారు.
మరో మూడు నెలల్టో ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పార్టీ శ్రేణులను ఎన్నికలకు సమాయత్తం చేసేందుకే చంద్రబాబు కుప్పం సమావేశాన్ని ఏర్పాటు చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఇక తరచూ తాను కుప్పంలో పర్యటిస్తానని చంద్రబాబు తెలిపారు. అవసరమైతే… రెండు నెలలకు ఒక సారి కుప్పం పర్యటన పెట్టుకుంటానని కూడా ఆయన పేర్కొన్నారు. వెరసి కుప్పం పార్టీ బాధ్యతలను తానే స్వయంగా చూసుకుంటానంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు ఆ నియోజకవర్గ పార్టీ నేతలను సంభ్రమాశ్యర్యాలకు గురి చేసిందని చెప్పాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates