మోపిదేవికి మోక్షం ఎప్పుడు… ?

వైసిపి నుంచి బయటకు వచ్చి టీడీపీలో చేరిన మాజీమంత్రి, రాజ్యసభ మాజీ సభ్యుడు మోపిదేవి వెంకటరమణ పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. ప్రస్తుతం ఆయన టిడిపిలోనే ఉన్నారు. వాస్తవానికి 2024 ఎన్నికల తర్వాత వైసీపీ నుంచి బయటకు వచ్చిన మోపిదేవి తన రాజ్యసభ స్థానాన్ని కూడా వదులుకున్నారు. అప్పటినుంచి ఆయన కీలక పోస్టు కోసం ఎదురు చూస్తున్నారు. కానీ పార్టీలో మోపిదేవి వెంకటరమణ వ్యవహారం ఎప్పటికప్పుడు చర్చకు వచ్చినప్పటికీ పదవుల విషయానికి వచ్చేసరికి మాత్రం ఆయన వెనుక పడుతున్నారు.

దీనికి ప్రధాన కారణం రేపల్లె నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి అనగాని సత్యప్రసాద్ వర్సెస్ మోపిదేవి వెంకటరమణ మధ్య ఉన్న రాజకీయ విభేదాలు కారణమని తెలుస్తోంది. ఈ విభేదాలను పరిష్కరించుకొని, ఒకరికొకరు కలుసుకునే దిశగా అడుగులు వేస్తే అప్పుడు పార్టీ ఏదైనా కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని కూడా అంటున్నారు. ఇటీవల మూడు మాసాల కిందట జరిగిన కార్యక్రమంలో ఇరువురు నాయకులు ఒకే వేదికపై కనిపించారు. దీంతో ఇద్దరి మధ్య విభేదాలు సమసిపోయాయని భావించారు.

కానీ అనూహ్యంగా మంత్రి అనగాని సత్యప్రసాద్ కు వ్యతిరేకంగా కొన్ని మీడియా వర్గాలు రాస్తున్న కథనాలు క‌ల‌క‌లం రేపుతున్నాయి. దీని వెనుక‌ అదృశ్య శక్తులు ఉన్నాయంటూ పార్టీకి సమాచారం అందింది. అయితే దీని వెనక ఎవరున్నారు ? అనేది స్పష్టత లేకపోయినప్పటికీ అంతర్గతంగా జరుగుతున్న విభేదాల కారణంగా మోపిదేవి వెంకటరమణ చుట్టూ ఈ వివాదం నడుస్తోంది. దీనికి తోడు ఆయన కూడా మౌనంగా ఉంటున్నారు.

అనగాని సత్యప్రసాద్ పై వచ్చిన విమర్శల నేపథ్యంలో మోపిదేవి మౌనంగా ఉండడం, పార్టీ తరఫున బలమైన వాదన కూడా వినిపించకపోవడం వంటివి అంతర్గతంగా చర్చకు దారితీశాయి. నిజానికి రేపల్లె నియోజకవర్గంలో అనగాని సత్యప్రసాద్ వరుస విజయాలు దక్కించుకున్నారు. 2019లో వైసీపీ గాలి వీచినప్పటికీ అనగాని విజయం సాధించారు.

గత ఎన్నికల్లో మరోసారి గెలుపు గుర్రం ఎక్కారు. మంత్రి పదవిని చేపట్టారు. ఈ క్రమంలో రాజకీయ ప్రత్యర్థిగా ఉన్న మోపిదేవి వెంకటరమణ టిడిపిలో ఉండడం మరోవైపు తనకు వ్యతిరేకంగా కొన్ని మీడియా వర్గాలు కథనాలు రాస్తున్న నేపథ్యంలో ఇరువురి మధ్య కూడా రాజకీయ సఖ్యత అయితే కనిపించడం లేదన్నది వాస్తవం.

ఇదే ఇప్పుడు మోపిదేవి వెంకటరమణ కు మైనస్ గా మారుతుందని తెలుస్తోంది. మరి ఆయన తన పరిస్థితి మార్చుకొని పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తే ఖచ్చితంగా ఆయన కోరుకున్న పదవి దక్కే అవకాశం ఉందని సీనియర్లు చెబుతున్నారు. మరి ఇది జరుగుతుందా లేదా అనేది చూడాలి. ఏది ఏమైనా రేపల్లె నియోజకవర్గంలో కొంత అసంతృప్తితో పాటు నాయకుల మధ్య విభేదాలు కూడా కొనసాగుతున్నా యి అన్నది వాస్తవం.