వైసీపీ మాజీ ఎమ్మెల్యే ఏపీకి చెందిన బొల్లా బ్రహ్మనాయుడికి హైదరాబాద్‌లోని ఉప్పరపల్లి కోర్టు రిమాండ్ విధించింది. దీంతో ఆయనను పోలీసులు చంచల్‌గూడ జైలుకు తరలించారు. శనివారం సాయంత్రం 4 గంటల సమయంలో కోర్టుకు తీసుకువచ్చిన పోలీసులు.. ఆయనపై రిమాండ్ రిపోర్టును కోర్టుకు వివరించారు. ఈ సమయంలో బొల్లా తరఫు న్యాయవాది, పోలీసుల తరఫు న్యాయవాది కోర్టుకు తమ వాదనలు వినిపించారు. చివరకు కోర్టు ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించింది.
కాగా.. ఏపీలోని వినుకొండ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత బొల్లా.. శేరిలింగం పల్లిలోని గండికో టలో 9.28 ఎకరాల భూమిని నకిలీ పత్రాలు సృష్టించి కబ్జా చేసేందుకు ప్రయత్నించారని పోలీసులు గుర్తించారు. దీనిపై తహసీల్దార్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా.. విచారణ చేపట్టారు. బొల్లా న్యాయవాది రాధాకృష్ణ .. నకిలీ పత్రాల సృష్టికి 4 కోట్ల రూపాయలను వెచ్చించారని తెలుసుకున్నారు. ఎకరా సుమారు 70 నుంచి 80 లక్షల రూపాయలు పలుకుతుండగా.. కేవలం మొత్తం భూమిని దక్కించుకునేందుకు 3.5 కోట్ల రూపాయలకు ఒప్పందం కుదుర్చుకున్నారని గుర్తించారు.
ఈ క్రమంలో బొల్లా చేసిన అక్రమాలను అన్ని కోణాల్లోనూ వెలికి తీసిన పోలీసులు.. ఆయనను శుక్రవారం సాయంత్రం తమిళనాడులోని కాంచీపురంలో అరెస్టు చేసి.. అక్కడి నుంచి హైదరాబాద్‌కు తీసుకువచ్చారు. దాదాపు 15 గంటల పాటు పోలీసులు విచారించారు. ఈ అక్రమాల వెనుక కడప వైసీపీ నాయకుల ప్రమేయంపై ఆరా తీశారు. అదేవిధంగా ఎక్కడెక్కడ భూములు కబ్జా చేశారన్న వివరాలను కూడా రాబట్టి నట్టు తెలిసింది. అనంతరం.. బొల్లాను ఉప్పరపల్లి కోర్టుముందు హాజరు పరిచారు.
రాజకీయమే!
మరోవైపు.. బొల్లా అరెస్టుపై వైసీపీ నాయకులు ఉద్యమించారు. శేరిలింగంపల్లి పోలీసు స్టేషన్ ముందు నిరసన వ్యక్తం చేశారు. ఏపీ నుంచి వచ్చిన వైసీపీ మాజీ ఎమ్మెల్యేలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. ఇదంతా రాజకీయ కక్ష పూరిత కేసులో భాగమేనని ఆరోపించారు. అయితే.. వాస్తవానికి హైదరాబాద్‌లో బొల్లాకు రాజకీయ శత్రువులు ఎవరూ లేరు. వైసీపీ రాజకీయాలు ఏపీలోనే ఉన్నాయి. అయినప్పటికీ.. నాయకులు మాత్రం తమ నేతను రాజకీయ కారణాలతోనే అరెస్టు చేశారని.. నకిలీ కేసు నమోదు చేశారని ఆరోపించారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates