ఏపీ అసెంబ్లీ, శాసన మండలి సమావేశాలు సోమవారం(ఆగస్టు 17) నుంచి ప్రారంభం అవుతున్నాయి. అసెంబ్లీకి వైసీపీ నాయకులు ఎలానూ రావడం లేదు. తమకు ప్రధాన ప్రతిపక్షం హోదా ఇస్తే తప్ప.. వచ్చేది లేదని చెప్పారు. ఇక, మండలిలో తమకు బలం ఉంది కాబట్టి.. అక్కడ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేలా వ్యూహాత్మకంగా వ్యవహరించా లని జగన్ స్పష్టం చేశారు. ఇదే సమయంలో శాసన మండలి డిప్యూటీ చైర్మన్ ఎన్నికను అనుకూలంగా మార్చుకోవాలని నాయకులకు తేల్చి చెప్పారు.
ఇప్పటికే వైసీపీ తరఫున ప్రకాశం జిల్లాకు చెందిన తూమాటి మాధవరావును జగన్ ఎంపిక చేశారు. ఆయనను ఏకగ్రీవంగా వైస్ చైర్మన్ పదవికి ఎంపిక చేసేలా చూడాలని మండలిలో విపక్ష నాయకుడు, సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణకు జగన్ సూచించారు. దీనికి వైసీపీ ఎమ్మెల్సీలు కూడా సహకరించాలన్నారు. టీడీపీ సహా ఇతర పక్షాలను నిలువరించి.. ఎన్నిక విధానం సాఫీగా జరిగేలా చూడాలని దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా తూమాటిని పార్టీ ఎమ్మెల్సీలకు జగన్ పరిచయం చేశారు.
మారిన టీడీపీ వ్యూహం
మండలిలో డిప్యూటీ చైర్మన్‌గా ఉన్న జకియా ఖానుం.. గత నెల 31న పదవీ కాలం పూర్తికావడంతో రిటైరయ్యారు. ఆ స్థానంలో కొత్తవారిని ఎంపిక చేయాల్సి ఉంటుంది. అయితే.. ప్రభుత్వ పక్షానికి అసెంబ్లీలో భారీ మెజారిటీ ఉన్నా.. మండలిలో వైసీపీకే ఎక్కువమంది సభ్యులు ఉన్నారు. దీంతో ఎన్నిక అనివార్యంగా మారింది.
అయితే.. దీనిని ఏకపక్షంగా వదిలేయాలని ముందు భావించినా.. ఇది తప్పుడు సంకేతాలు ఇచ్చినట్టు అవుతుందని ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఎన్నిక నిర్వహించేందుకు వీలుగా నిర్ణయం తీసుకునేందుకు చంద్రబాబు మొగ్గు చూపుతున్నారు.
అంటే.. కూటమి పక్షాల తరఫున కూడా ఒక అభ్యర్థిని మండలి వైస్ చైర్మన్ పదవికి ఎంపిక చేస్తారు. అనంతరం.. వైసీపీ తరఫున ఎంపికైన తూమాటిపై పోటీకి నిలబెడతారు.
నిజానికి కూటమికి బలం లేకపోయినా.. వైసీపీలో ఉన్న అసంతృప్తులు, ఉపాధ్యాయ, పట్టభద్ర ఎమ్మెల్సీలు, అలాగే స్థానిక సంస్థల కోటాలో వచ్చిన ఎమ్మెల్సీలు తమకు మద్దతు తెలిపితే.. వైసీపీకి మెజారిటీ ఉన్నా.. తగ్గించవచ్చన్నది చంద్రబాబు ఆలోచన.
ఈ నేపథ్యంలో వైస్ చైర్మన్ పదవికి బీసీ నేత పంచుమర్తి అనురాధ, లేదా ఎస్సీ వర్గానికి చెందిన గ్రీష్మను ఎంపిక చేసే ఆలోచనలో ఉన్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates