గంజాయి బ్యాచ్ హద్దులు మీరుతుంది

హైదరాబాద్ ఈగల్ పోలీసులకు గంజాయి ముఠా చుక్కలు చూపించింది. పక్కా సమాచారంతో పట్టుకునేందుకు వెళ్లిన ఈగల్ పోలీసులపై తిరగబడిన గంజాయి ముఠా నానా హంగామా సృష్టించింది. దాంతో పోలీసులకు చిర్రెత్తుకొచ్చింది. గంజాయి ముఠాను అరెస్టు చేసి జైలుకు పంపించింది.

హైదరాబాద్ లోని బాలా నగర్ కు చెందిన బొల్ల కిరణ్ కుమార్, బొల్ల దుర్గా ప్రసాద్, బొల్ల కమలాకర్ కొంత కాలంగా గుట్టు చప్పుడు కాకుండా గంజాయి విక్రయిస్తున్నారు. ఒడిశా నుంచి పెద్ద మొత్తంలో గంజాయి తీసుకొచ్చి చిన్న చిన్న పాకెట్లుగా చేసి అమ్ముకొని సొమ్ము చేసుకుంటున్నారు.

పక్కా సమాచారంతో రంగంలోకి దిగిన ఈగల్ టీం ఆకస్మిక దాడులు చేసి తనిఖీలు నిర్వహించింది. దాంతో గంజాయి ముఠా గుట్టు రట్టయ్యింది. 2025 నుంచి 1400 ఆన్ లైన్ లావాదేవీలు నిర్వహించి 20 లక్షల రూపాయలకు పైగా వసూలు చేసినట్లు ఈగల్ టీం నిర్దారించింది. ఈ వ్యవహారంలో 31 మంది సరఫరాదారులను, 240 మంది వినియోగదారులను గుర్తించి కేసు నమోదు చేశారు.

సోదాలకు బాలా నగర్ వెళ్లిన ఈగల్ టీం పై బొల్ల బ్రదర్స్ తిరగబడ్డారు. కుక్కలను వొదిలి హల్ చల్ చేశారు. కత్తితో దాడి చేసి భయబ్రాంతులు సృష్టించారు. పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు. అయినా వెనకంజ వేయని ఈగల్ టీం నలుగురిని అరెస్టు చేసింది. మరికొందరు వినియోగదారులను కూడా అరెస్టు చేశారు. ఈ ఘటన తెలంగాణాలో సంచలనం సృష్టిస్తుంది.