అక్కడ తోటి పిల్లలే టీచర్లు…

ఆ పాఠశాలలో సంప్రదాయ విద్యా విధానం లేదు.. సహచర విద్యార్థుల ద్వారానే పాఠాలు నేర్చుకుంటారు… ఈ ప్రత్యేకతలు ఉన్న పాఠశాలను మంత్రి నారా లోకేష్సందర్శించారు. మాస్కో స్బేర్లో ఆధ్వర్యంలో నడుస్తున్న ఆ పాఠశాల పేరు స్కూల్ 21. మాస్కో పర్యటనలో ఉన్న లోకేష్ సాంప్రదాయ విద్యావిధానానికి భిన్నంగా అక్కడ అనుసరిస్తున్న విధానాలను నిర్వాహకులు, విద్యార్థుల ద్వారా ప్రత్యక్షంగా తెలుసుకున్నారు.

ఈ స్కూలు ప్రవేశం కోసం ఎంపిక ప్రక్రియ వినూత్నంగా, విభిన్నంగా ఉంటుంది. స్కూల్ 21 అనేది రష్యాలో స్బేర్‌బ్యాంక్ ప్రారంభించిన ఉచిత ప్రోగ్రామింగ్, సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ విద్యా కార్యక్రమం. ఇక్కడ విద్యార్థుల నుంచి ఎటువంటి ట్యూషన్ ఫీజు వసూలు చేయరు. ఇది ఇంటర్నేషనల్ 42 నెట్‌వర్క్‌లో సభ్యత్వం కలిగి, స్వతంత్రంగా పనిచేస్తుంది, ఫ్రెంచ్ కోడింగ్ స్కూల్ అయిన ఎకోల్ 42 రూపొందించిన వినూత్నమైన భవిష్యత్ పాఠశాల విద్యా పద్ధతులను అనుసరిస్తుంది.

స్బేర్‌బ్యాంక్ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘స్కూల్ 21’లో సంప్రదాయ తరగతులు, ఉపాధ్యాయులు, అధికారిక ఉపన్యాసాలు, గ్రేడ్‌ల వ్యవస్థ ఉండదు. విద్యార్థులు ప్రాజెక్ట్‌ల ఆధారంగా, సహచర విద్యార్థుల సహకారంతో నేర్చుకుంటారు. ఒకరి పనిని మరొకరు మూల్యాంకనం చేస్తూ నైపుణ్యాలను పెంపొందించుకుంటారు.

ఫ్రాన్స్‌కు చెందిన ఈకోల్42 రూపొందించిన వినూత్న విద్యా నమూనాను అనుసరిస్తున్న ఈ సంస్థ, అంతర్జాతీయ ‘42 నెట్‌వర్క్’లో సభ్యత్వం కలిగి స్వతంత్రంగా పనిచేస్తోంది. ఐటీ, సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ రంగాల్లో పూర్తిగా ఉచిత శిక్షణను అందిస్తోంది. విద్యార్థుల నుంచి ఎటువంటి ట్యూషన్ ఫీజులు వసూలు చేయరు. మొత్తం వ్యయాన్ని స్బేర్‌బ్యాంక్ భరిస్తోంది.

ఈ పాఠశాల మరో ప్రత్యేకత 24 గంటలూ, వారంలో ఏడు రోజులూ అందుబాటులో ఉండటం. విద్యార్థులు తమకు అనుకూలమైన సమయాల్లో క్యాంపస్‌ను వినియోగించుకొని అధ్యయనం చేసే అవకాశం కల్పించారు. ప్రవేశ ప్రక్రియ కూడా ప్రత్యేకంగానే ఉంటుంది.

గత విద్యార్హతలు, డిగ్రీలు లేదా కోడింగ్ పరిజ్ఞానాన్ని పరిగణనలోకి తీసుకోరు. అభ్యర్థులు ముందుగా ఆన్‌లైన్‌లో కాగ్నిటివ్ టెస్ట్ పూర్తి చేయాలి. అనంతరం ‘పిసిన్’ (స్విమ్మింగ్ పూల్) పేరుతో నిర్వహించే పలు వారాల కఠిన శిక్షణ, మూల్యాంకన శిబిరంలో పాల్గొనాల్సి ఉంటుంది. అక్కడ సమస్యల పరిష్కార సామర్థ్యం, అనుకూలత, సృజనాత్మకత ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.