వైసీపీలో పొలిటికల్ అఫైర్స్ కమిటీ (పీసీఏ)ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. గత ఎన్నికల్లో పరాజయం తర్వాత.. జగన్.. పీఏసీకి శ్రీకారం చుట్టారు. వయోవృద్ధులు.. ఇక, వచ్చే ఎన్నికల్లో అవకాశం దక్కని వారికి ఈ కమిటీలో చోటు కల్పించారు. ఈ కమిటీని ఏర్పాటు చేసిన సమయంలోనే జగన్ కొన్ని నిర్దేశాలు చెప్పారు. పార్టీకి సరైన దిశగా సలహాలు ఇవ్వాలని.. సూచనలు చేయాలని ఆయన పేర్కొన్నారు.
కానీ, అనుకున్న విధంగా పీఏసీ నాయకులు ఎవరూ స్పందించడం లేదు. జగన్ ఉంటే ఒకలా.. లేకపోతే మరోలా పీఏసీలోని నాయకులు వ్యవహరిస్తున్నారన్న వాదన కొన్నాళ్లుగా వినిపిస్తోంది. దీంతో క్షేత్రస్థాయిలో చేపట్టే కార్యక్రమాలకు పెద్దగా మైలేజీ రావడం లేదని పార్టీ భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే జగన్ పీఏసీపై కినుక వహిస్తున్నారని సమాచారం. పనిచేయకపోతే.. పీఏసీని మారుస్తారంటూ.. ఇటీవల సీనియర్ నేత ఒకరు వ్యాఖ్యానించారు.
తాజాగా పీఏసీ కార్యాచరణ, పనులు, పార్టీలో యాక్టివ్ రోల్ వంటివాటిపై జగన్ ఆరా తీశారు. దీనిలో ఎక్కువ మంది పీఏసీ నాయకులు మౌనంగా ఉంటున్నారని.. ప్రత్యర్థి పార్టీలు చేస్తున్న విమర్శలకు.. కౌంటర్లు ఇవ్వలేక పోతున్నారని తెలిసింది. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన జగన్.. పీఏసీ కమిటీ సభ్యుల వివరాలను మరోసారి తీసుకున్నారు. దీనిలో ఉన్న కొందరు నాయకులు పార్టీకి పెద్దగా ప్రయోజనం లేకుండా పోయారని అంటున్నారు.
అయితే.. పీఏసీలో ఉన్న నాయకుల నుంచి మరో వాదన వినిపిస్తోంది. తమను కనీసంపట్టించుకునే వారు లేరని వారు చెబుతున్నారు. తాము సూచనలు, సలహాలు ఇచ్చినా.. ఎవరూ ఆచరించడం లేదని.. తీసేసిన తహసీల్దార్ మాదిరిగా తమ పరిస్థితి మారిపోయిందని వాపోతున్నారు. తాము కూడా యాక్టివ్ రోల్ పోషిస్తున్నామని.. కానీ, తమకు ప్రాధాన్యం లేకుండా పోయిందని అంటున్నారు. జగన్ తమను పిలిస్తే.. జాబితానే వెల్లడిస్తామని చెబుతున్నారు. సో.. మొత్తంగా పీఏసీ వ్యవహారం వైసీపీలో పెను సంచలనంగా మారింది.
Gulte Telugu Telugu Political and Movie News Updates