జగన్ తో అమరావతి రైతుల భేటీ నిజమేనా…?

వైసీపీ అదినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పేరు వింటేనే… ఏపీ రాజధాని అమరావతి నిర్మాణం కోసం భూములు ఇచ్చిన రైతులు భగ్గుమన్నారు. భగ్గుమనడంతో పాటుగా జగన్ అధికారంలో ఉన్నంతకాలం వారంతా రోడ్లెక్కి మరీ జగన్ ఎప్పుడెప్పుడు అదికారం నుంచి దిగిపోతారా? అని ఎదురు చూశారు. జగన్ పదవి పోవాలంటూ దేవుళ్లకు పూజలు చేశారు. శాపనార్థాలు పెట్టారు. జగన్ ఉంటే… తమ కలలు ఫలించవని ఆవేదన వ్యక్తం చేశారు. అలాంటిది ఇప్పుడు అదే అమరావతి రైతులు జగన్ తో బేటీ అయ్యారన్న వార్త వస్తే… ఇది నిజమేనా? అని అనుమానించక తప్పదు కదా.

ఇందులో అనుమానించాల్సిందేమీ లేదు. ఎందుకంటే రాజధాని అమరావతికి భూములిచ్చిన, భూములు ఇవ్వాలని ప్రభుత్వం గుర్తించిన రైతుల్లోని కొందరు మంగళవారం తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయానికి వెళ్లారు. వారంతా జగన్ తో భేటీ అయ్యారు. తాము అన్యాయానికి గురవుతున్నామని జగన్ వద్ద మొరపెట్టుకున్నారు. తమను ఆదుకోవాలని, తమ పక్షాన గళం విప్పాలని కోరారు. అందుకు జగన్ కూడా వారికి మద్దతుగా నిలుస్తానని ప్రకటించారు. వారి తరఫున కూటమి ప్రభుత్వంపై పోరాటం సాగిస్తానని చెప్పారు.

ఇదంతా నిజమా? అంటే.. నిజమే మరి. అయితే నాడు జగన్ కు వ్యతిరేకంగా రోడ్డెక్కిన రైతులు ఏ ఒక్కరూ ఇప్పుడు తాడేపల్లి గడప తొక్కిన రైతుల్లో లేరు. వీరంతా నాటి ఆందోళనల్లో పాల్గొనని వారే. ఇంకా చెప్పాలంటే.. రాజదాని అమరావతి నిర్మాణం కోసం నాడు భూములిచ్చిన రైతుల్లో ఒకరిద్దరు తప్పించి అంతా కొత్త వారే. అంటే… కూటమి సర్కారు రెండో విడత భూ సమీకరణకు నోటీసు జారీ చేసింది కదా.. అందులో భూములు కోల్పోతున్న వారిలో కొందరు మాత్రమే మంగళవారం నాడు జగన్ వద్దకు వచ్చారు.

ఇలా ఇప్పుడు జగన్ తో భేటీ అయిన వారిలో కొన్ని భయాందోళనలు అయితే ఉన్నాయి. అవేంటంటే… గతంలో తీసుకున్న భూములను ఇప్పటిదాకా అభివృద్ది చేయలేదు. అంతేకాకుండా ఈ కారణంతో నాడు భూములిచ్చిన రైతులకు నేటికీ పూర్తి స్థాయిలో రిటర్నబుల్ ఫ్లాట్లు రాలేదు. అంటే… ఇప్పటికే భూములు ఇచ్చిన రైతులకు ఫ్లాట్లు రాకుంటే… ఇప్పుడు ఇచ్చిన తమ పరిస్థితి ఏమిటన్నది ఈ రైతుల భయం. ఈ కారణంగానే వారంతా వైసీపీ నుంచి పిలుపు రాగానే.. తాడేపల్లికి వచ్చేశారు. మరి వీరి డిమాండ్ల మేరకు కూటమి ప్రభుత్వంపై జగన్ పోరాటం చేస్తారా? భూ సమీకరణను అడ్డుకోగలరా? అంటే… వేచి చూడాల్సిందే మరి.