ఇగోలు పక్కన పెట్టండి..

టీడీపీ మహానాడు వేదికగా పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. మరోసారి విజయం దక్కాలంటే పార్టీ నేతల మధ్యే కాకుండా కూటమి పార్టీల నాయకుల మధ్య కూడా సఖ్యత అత్యంత ముఖ్యమని చెప్పారు. ఈ క్రమంలో అందరూ ఇగోలు (అహంకారం) దూరం పెట్టాలని, వాటిని త్యజించాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. అందరూ కలిసికట్టుగా ఉంటేనే మరోసారి విజయం దక్కుతుందని తేల్చి చెప్పారు.

స్థానిక ఎన్నికల్లో సమన్వయం అవసరం

స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో అందరూ కలిసికట్టుగా ముందుకు సాగాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. ప్రతి వార్డు, ప్రతి కౌన్సిల్ కూడా ముఖ్యమేనని చెప్పారు. ఈ విషయంలో ఎవరూ ఉదాసీనంగా ఉండొద్దని ఆయన సూచించారు. ప్రతి ఒక్కరూ పనిచేయాలని, అందరినీ కలుపుకొని ముందుకు సాగాలని చెప్పారు. ఏ ఎన్నికలైనా కూటమికి ప్రతిష్టాత్మకమేనని చంద్రబాబు అన్నారు. కేవలం అసెంబ్లీ ఎన్నికలు మాత్రమే కాదని, అన్ని ఎన్నికలు ముఖ్యమేనని పేర్కొన్నారు.

కేడర్ శక్తే పార్టీ బలం

కార్యకర్తలు రెట్టించిన ఉత్సాహంతో ముందుకు సాగాలని చంద్రబాబు సూచించారు. ప్రతి ఒక్కరూ పార్టీ కోసం, కూటమి కోసం కలిసి పనిచేయాలన్నారు. 2024లో వచ్చిన భారీ విజయం మరోసారి పునరావృతం కావాలని ఆకాంక్షించారు. పార్టీకి కేడరే అత్యంత కీలకమని వెల్లడించారు. పార్టీ ముందుంటుందని, కేడర్‌ను ముందుకు తీసుకువెళ్తుందని చెప్పారు. కేడర్‌ను సమన్వయం చేసుకునే బాధ్యత నాయకులదేనని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలని సూచించారు.

ఓటరు జాబితాలపై అప్రమత్తంగా ఉండాలి

మనదంతా ఉమ్మడి కుటుంబమని చెప్పిన చంద్రబాబు, చిన్న చిన్న విభేదాలు వచ్చినా సర్దుకుపోవాలని సూచించారు. పార్టీ బలంగా ఉండడంతో పాటు కార్యకర్తలు కూడా బలంగా ఉన్నప్పుడే ఏదైనా సాధించగలమన్నారు. ఇక త్వరలో ప్రారంభం కానున్న సర్వే ప్రక్రియ విషయంలోనూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. టీడీపీ ఓటర్ల పేర్లు, జాబితాల విషయంలో నాయకులు దగ్గరుండి జాగ్రత్తగా పర్యవేక్షించాలని చెప్పారు. ప్రతి ఓటూ కీలకమేనని చంద్రబాబు పేర్కొన్నారు.