తేడా వస్తే మన తన చూడని పవన్

జనసేన అధినేత పవన్ కల్యాణ్… ఏపీ డిప్యూటీ సీఎం హోదాలో గడచిన రెండు రోజులుగా గోదావరి పుష్కరాల చుట్టూనే తిరుగుతున్నారు. గోదావరి పుష్కర ఏర్పాట్ల పరిశీలన కోసం ఆదివారం రాత్రి రాజమహేంద్రవరం చేరుకున్న పవన్… సోమవారం గోదావరి తీరాన్ని పరిశీలించారు. మంగళవారం కూడా ఆయన ఆ పరిసరాల్లోనే తిరుగుతున్నారు. ఈ సందర్భంగా తన సొంత పార్టీకి చెందిన నేత, మంత్రి కందుల దుర్గేశ్ కే క్లాస్ పీకారు. ప్రజల సంక్షేమం విషయానికి వస్తే.. పవన్ మన తన అని చూడరని చెప్పడానికి ఇదే నిదర్శనమని చెప్పక తప్పదు.

గోదావరి పుష్కరాలకు ఇంకా ఏడాది సమయం ఉన్న సంగతి తెలిసిందే. అయితే పుష్కరాలకు ఏడాది మాత్రమే సమయం ఉందంటున్న పవన్… ఈ స్వల్పకాల వ్యవధిలో ఏర్పాట్లను పకడ్బందీగా చేయాలన్న కసితో ఆయన సాగుతున్నారు. అధికారులను స్థానిక ప్రజా ప్రతినిధులను ఆయన పరుగులు పెట్టిస్తున్నారు. ఈ క్రమంలో మంగళవారం ఉదయం రాజమహేంద్రవరం రూరల్ సమీపంలో గోదావరి పరిసరాలను పరిశీలిస్తూ సాగిన పవన్… ఓ చోట గోదారిలోకి మురుగు చేరుతున్న ప్రదేశం వద్ద ఆగారు.

పుష్కర ఘాట్ల సమీపంలోకి ఇలా మురుగు చేరుతుంటే మీరేం చేస్తున్నారని ఆయన అధికారులను ప్రశ్నించారు. ఆ సమయంలో పవన్ వెంట జనసేనకు చెందిన కేబినెట్ మంత్రులు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేశ్ లు ఉణ్నారు. కందుల దుర్గేశ్ పర్యాటక శాఖను పర్యవేక్షిస్తున్న సంగతి తెలిసిందే. పుష్కరాల ఏర్పాట్లను కూడా చూస్తున్న పర్యాటక శాఖ మంత్రి హోదాలో దుర్గేశ్ అక్కడకు రాగా… ఇదేం పద్దతి దుర్గేశ్ అంటూ పవన్ ఆయనను నిలదీశారు. పుష్కర ఘాట్లకు సమీంలో నదిలోకి మురుగు చేరుతుంటే మీకు కనిపించలేదా? అని ఆయనను పవన్ ప్రశ్నించారు.

దుర్గేశ్ ఏదో సమాధానం చెప్పేలోగానే తిరిగి తానే అందుకున్న పవన్… ఇలాంటి నీటిలో పుష్కర స్నానం చేసే భక్తులకు పుణ్యం మాట అటుంచితే వ్యాధులు మాత్రం వచ్చి తీరతాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ పరిస్థితిని మార్చేందుకు చాలానే శ్రమిస్తున్నామని దుర్గేశ్ చెప్పగా..మరి మార్పెక్కడ అంటూ పవన్ ఎదుచు ప్రశ్నించారు.

సదరు కాలుష్యాలకు సంబంధించిన వ్యక్తులు, సంస్థలు పెద్దగా స్పందించడం లేదని దుర్గేశ్ చెప్పినంతనే పవన్ మరింత ఆగ్రహానికి గురయ్యారు. మీకు ఎదురు చెప్పేవారు ఎవరైనా ఉంటే వారిని తన వద్దకు పంపాలని ఈ సందర్భంగా పవన్ చెప్పారు. ఈ మాటతో ప్రజలకు మంచి చేయాలన్న ఉద్దేశాన్ని సాగనివ్వని వారి భరతం పట్టేందుకు ఎంతమాత్రం వెనుకాడేది లేదన్న రీతిలో పవన్ సాగారన్న విశ్లేషణలు సాగుతున్నాయి.