జనసేన అధినేత పవన్ కల్యాణ్.. తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీలో కార్యకర్తలకు ఉన్న దూకుడు.. పనిచేద్దామన్న భావన.. నాయకులకు లేకుండా పోయిందన్నారు. పదవులు వచ్చిన తర్వాత నాయకులు చప్పబడి పోయారని తీవ్ర వ్యాఖ్యలు చేయడం గమనార్హం. రాజమండ్రిలో పర్యటిస్తున్న పవన్ కల్యాణ్.. పార్టీ నాయకులను ఉద్దేశించి మాట్లాడారు. పార్టీలో పనిచేయగలిగిన వారే ఉండాలని.. లేకపోతే.. పార్టీ నుంచి వెళ్లి పోవచ్చని తెగేసి చెప్పారు. వ్యక్తిగతంగా విమర్శలు చేస్తే సహించేది లేదన్నారు.
పదువులు రాగానే మెత్తబడిపోయిన నాయకులు పార్టీకి అవసరం లేదని పవన్ చెప్పారు. టీడీపీ కోసం తాను పనిచేయడం లేదని.. రాష్ట్రం కోసం.. రాష్ట్ర ప్రజల కోసమే పనిచేస్తున్నానని చెప్పారు. అందుకే సర్దుకు పోతున్నానని వ్యాఖ్యానించారు. అన్నింటికీ తెగించే తాను రాజకీయాల్లోకి వచ్చానని చెప్పారు. శత్రువు బలంగా ఉన్నప్పుడే కొడతామని.. బలహీనంగా ఉన్నప్పుడు కాదని వ్యాఖ్యానించారు.. కులాలను రెచ్చగొట్టే మనస్తత్వం మంచిది కాదని సూచించారు. పార్టీలో ఉండగలిగే వారే ఉండాలని లేకపోతే వెళ్లిపోవచ్చని తేల్చి చెప్పారు.
వ్యక్తిగతంగా విమర్శిస్తే.. అంతే స్థాయిలో బదులిస్తామని పవన్ తేల్చి చెప్పారు. `భరిస్తాం.. సహిస్తాం.. అవసరమైతే తాటతీస్తాం“ అని వ్యాఖ్యానించారు. పార్టీలో ఉన్నవారంతా సిద్ధాంతాలకు కట్టుబడి పనిచేయాలని సూచించారు. ప్రజల కోసమే తాను రాజకీయాల్లోకి వచ్చానని.. దీనికిగాను ఒక సిద్ధాంత ప్రాతిపదికను ఏర్పాటు చేసుకుని ముందుకు సాగుతున్నట్టు వివరించారు. జనసేన కార్యకర్తలు, నాయకులు మరింత బలపడాల్సి ఉందని చెప్పారు. కానీ.. కార్యకర్తల పరిస్థితి ఎలా ఉన్నప్పటికీ.. నాయకులు మాత్రం చప్పబడి పోయారని విమర్శించారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates