కేటీఆర్ బిడ్డ చదువుకోవడానికి గొప్ప కాలేజీ లేదా

‘‘రేపు నా బిడ్డను డ్రాప్ చేయడానికి అమెరికా వెళ్లాలి…ఇక్కడే చదువుకోవచ్చు కదా అని అడిగితే…అంత గొప్ప కాలేజీలు ఇక్కడ ఎక్కడున్నాయి అని అడుగుతోంది..ఇంకేం చెప్పాలి…అది కూడా వాస్తవం’’ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన కామెంట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

కేటీఆర్ వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో చర్చ జరుగుతోంది. అయితే, తాను ఈ వ్యాఖ్యలు చేసింది ఒక సగటు భారతీయుడిగా అని, ఒక పార్టీ ప్రతినిధిగా కాదని కేటీఆర్ క్లారిటీ ఇచ్చి మరీ ఈ కామెంట్స్ చేసినప్పటికీ సోషల్ మీడియాలో ఆ వ్యాఖ్యలపై మాత్రం భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

మన పిల్లలు చదువుకోవడానికి అమెరికా ఎందుకు పోవాలని కేటీఆర్ ప్రశ్నించారు. ఇదే ప్రశ్న తన బిడ్డను అడిగితే అంత మంచి కాలేజీలు ఇక్కడ లేవు అని సమాధానమిచ్చిందని కేటీఆర్ అన్నారు. ఆ మాట వాస్తవమని, మంచి కాలేజీలు ఇక్కడ లేవని చెప్పారు.

అయితే, మేధస్సు ఉండి, అవకాశాలు అందిపుచ్చుకోవాలి అనుకొని, వనరులుంటే విదేశాలకు వెళ్లిపోతున్నారని అన్నారు. 80 ఏళ్లయిందని, ఐఐటీలు, ఐఐఎమ్ లు పెట్టినా సుదూర తీరాలకు చదువుకునేందుకు వెళుతున్నారని చెప్పారు. ఈ దేశంలో నాయకత్వ లోపం ఉందని, మతం పేరు మీద, కులం పేరు మీద పనికిమాలిన రాజకీయాలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇక్కడ, సగటు భారతీయుడిగా, సగటు తండ్రిగా కేటీఆర్ ఆవేదన సబబే. కానీ, మాజీ మంత్రిగా పనిచేసిన అనుభవం ఉండి, ఒక పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయి ఉండి, భవిష్యత్తులో సీఎం కావాలని కలలుగంటున్న కేటీఆర్ నుంచి ఇటువంటి కామెంట్స్ రావడం సరికాదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

దేశం సంగతి పక్కనబెడితే…తెలంగాణను పదేళ్లు పాలించిన పార్టీలో కీలక వ్యక్తిగా చక్రం తిప్పిన కేటీఆర్ ఇక్కడి ప్రముఖ వర్సిటీలు, కాలేజీలను ఎందుకు ప్రక్షాళన చేయలేదని, వాటిని ప్రపంచ స్థాయి విద్యాసంస్థలుగా తీర్చిదిద్దే ప్రయత్నం ఎందుకు చేయలేదని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. కేటీఆర్ బిడ్డ చదువుకోవడానికి ఇక్కడ గొప్ప కాలేజీ లేదా అని నిలదీస్తున్నారు.