జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్.. తన స్టయిల్‌ను మార్చేశారు. గతంలో మాదిరిగా అరుపులు.. కేకలు లేవు.. ఆయన చెప్పాలని అనుకున్న విషయాన్ని సూటిగా చెప్పేశారు. అంతేకాదు.. పార్టీ నాయకులను కడుపుబ్బ నవ్విస్తూనే.. చురకలు అంటించారు. తన మనసులోని భావాన్ని చెడిపోకుండా.. నవ్వుతూ.. నవ్విస్తూ.. నాయకులకు వెల్లడించారు.
సహజంగ పవన్ కల్యాణ్ అంటే.. ముందు నుంచి చివరి వరకు కూడా తన ప్రసంగాల్లో సీరియస్ నెస్‌ను కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. ఒకరకంగా చెప్పాలంటే.. ఒక ఉద్విగ్న వాతావరణం కనిపిస్తుంది. కానీ, తాజాగా రాజమండ్రి పార్లమెంటు పరిధిలోని నాయకులతో నిర్వహించిన సమావేశంలో ఎక్కడా ఆ తరహా సీరియస్ ముఖంలో కానీ.. హావ భావాల్లో కానీ.. కనిపించలేదు.
కానీ.. అదేసమయంలో మాటల్లో మాత్రం సూటితనం కనిపించింది. ఖచ్చితత్వం కొట్టొచ్చింది. ఈ తరహా వాతావరణం.. గత సమావేశాల్లో కొంత దూరమైందనే చెప్పాలి. పార్టీ నాయకులు గాడి తప్పుతున్న విషయం నుంచి రాజకీయ విశ్లేషణల వరకు.. పవన్ సూటిగానే స్పందించారు. అదేసమయంలో తమిళనాడు రాజకీయాల నుంచి ఏపీ రాజకీయాల వరకు అన్ని అంశాలను స్పృశించారు. కానీ, ఎక్కడా ఎవరిపైనా సీరియస్ అయినట్టు కనిపించలేదు. కానీ, అయ్యారు!.
ఇలా ఎందుకు?
రాజకీయాల్లో రెండు మార్గాలు ఉంటాయి. ఒకటి.. సీరియస్‌గా స్పందించడం. ఇది సాధారణంగా అన్ని పార్టీల్లోనూ కనిపిస్తుంది. కానీ, ఇది పెద్దగా వర్కవుట్ కావడం లేదు. ఇక, రెండో తరహా.. సుతిమెత్తగా మాట్లాడుతూనే.. తానేంటనేది చెప్పడం. ఏమాటకు ఆమాట చెప్పాల్సి వస్తే.. వైసీపీలో ఇది కనిపిస్తుంది. జగన్ ఎక్కడా సీరియస్ అయినట్టు కనిపించదు. కానీ, ఆయన చర్యలు మాత్రం సీరియస్‌గానే ఉంటాయి. అధికారంలో ఉన్నా.. లేకున్నా.. నాయకులకు.. జగన్ అంటే.. అంతే!.
ఈ తరహా పరిస్థితి ఒక్కొక్కసారి.. నాయకులను ఒంటరి చేస్తున్నా.. వర్కవుట్ అవుతున్న పరిస్థితి ఉంటుంది. తాజాగా పవన్ కల్యాణ్ కూడా.. ఇదే తరహా కాకపోయినా.. ముఖంలో చిరునవ్వులు చిందిస్తూనే.. తాను చేయాలనుకున్న పనులు, చెప్పాలనుకున్న విషయాలను ఖరాఖండీగా చెప్పేశారు. సో.. ఈ మార్పు.. జనసేనలో ఏమేరకు మార్పు తెస్తుందో చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates