గత వారంలో విలేకరుల సమావేశాన్ని సుదీర్ఘంగా నిర్వహించిన వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. పలు అంశాల్ని ప్రస్తావించటమే కాదు.. తన అంతటి మంచోడు ఇంకెవరు ఉంటారు? అంటూ ప్రశ్నించారు. తన తాతను చంపినోళ్లను కూడా తాను వదిలేసినట్లుగా చెప్పుకున్నారు. ఈ సందర్భంగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు.. ఆయన కుమారుడు కమ్ మంత్రి లోకేశ్ తీరుపైనా తీవ్రంగా మండిపడ్డారు.
తమ కుటుంబానికి క్లీన్ హిస్టరీ ఉందని.. మామను వెన్నుపోటు పొడిచిన ఘన చరిత్ర చంద్రబాబు సొంతంగా ఆయన మండిపడ్డారు. ఈ సంచలన వ్యాఖ్యలకు అధికార కూటమిలోని తెలుగుదేశం పార్టీ నుంచి పెద్ద ఎత్తున కౌంటర్లు వస్తున్నాయి. ఇప్పటికే ఈ అంశంపై చంద్రబాబుతో సహా పలువురు స్పందించారు. తాజాగా ప్రభుత్వ విప్.. టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు కాలవ శ్రీనివాసులు అనంతపురంలో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు.
జగన్ కుటుంబం నేర చరిత్రను తాజాగా ప్రస్తావిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను ఏదో చెప్పటం లేదంటూ.. గతంలో ప్రజాసంఘాల వారు ముద్రించిన పాలెగాళ్ల రాజ్యం పుస్తకాన్ని చూపిస్తూ షాకింగ్ ఆరోపణలు చేశారు. ప్రజల్లోకి ఉద్దేశపూర్వకంగా తప్పుడు సమాచారాన్ని జగన్ పంపుతున్నారన్న ఆయన.. రాజకీయ ప్రయోజనాల కోసం కుట్రలు పన్నుతున్నట్లుగా మండిపడ్డారు.
వైఎస్ జగన్ తాత రాజారెడ్డి కాలం నుంచే దౌర్జన్యాలు.. హత్యలు చేయటం అలవాటుగా పేర్కొన్నారు. జగన్ కుటుంబానిది ఆరు దశాబ్దాల రక్తచరిత్ర అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసిన కాలవ శ్రీనివాసులు.. ఈ సందర్భంలో గతంలో చోటు చేసుకున్న పలు అంశాల్ని పూసగుచ్చినట్లుగా వివరించే ప్రయత్నం చేశారు.
రాజారెడ్డి చేసిన నేరాల చరిత్రపై పెద్ద పుస్తకమే రాయొచ్చన్న కాలవ.. 1990 దశకంలో కడప జిల్లాలో వైఎస్ కుటుంబం చేసిన అరాచకాలపై ప్రజాసంఘాలు పుస్తకాన్ని వేశాయన్నారు. పరిటాల రవిని హత్య చేసిన మొద్దు శ్రీనును జగన్ డైరెక్షన్ లోనే జైల్లోనే అంతం చేశారన్నారు.
ఆ హత్యానేరాన్ని తనపై మోపేందుకు ప్రయత్నించినట్లుగా కాలవ ఆరోపించారు. 1970లో జరిగిన పంచాయితీ ఎన్నికల సందర్భంగా జగన్ తాత రాజారెడ్డి మీద (క్రైం నంబర్ 23/70) కేసు నమోదైందన్నారు. అంతేకాదు.. మరో రెండేళ్ల వ్యవధిలో అంటే 1972 అక్టోబరు 11న కోడుమూరు పోలీస్ స్టేషన్ మీద దాడి చేశారని.. 1975 జులై 15న ముగ్గురాయి గని ఓనర్ వెంకట నరసయ్యను చంపేశారన్న విషయాల్ని ప్రస్తావించారు.
రాజారెడ్డి.. జార్జిరెడ్డితో పాటు మరో 63 మంది కలిపి ఈ హత్యనేరంలో పాల్గొన్నట్లుగా పేర్కొన్నారు. 1990లోనూ పులివెందుల నగరగుట్టలఓ రాజారెడ్డి దొమ్మికి పాల్పడ్డారని.. అప్పట్లో ఆయన వెంట 200 మంది ఉన్నట్లుగా పేర్కొన్నారు. ఈ సందర్భంగా రూ.16 లక్షల నగదు.. నగలు దోచుకెళ్లిన చరిత్ర ఉందన్నారు.
1989లో జరిగిన కడప సహకార సంఘం ఎన్నికల్లో బ్యాలట్ పెట్టెల్లో నీళ్లు పోసిన ఘన చరిత్ర వైఎస్ సొంతమన్న కాలవ.. అప్పట్లో టీడీపీ ఎంపీ అభ్యర్థి కందుల రాజమోహన్ రెడ్డిపై భౌతికేదాడి ఘటనలోనూ రాజశేఖర్ రెడ్డి నిందితుడిగా పేర్కొన్నారు. దొమ్మీలు చేయటం.. పోలీసులపైనా.. పోలీస్ స్టేషన్ల పైనా దాడులు చేసే నీచమైన కల్చర్ రాజారెడ్డి.. వైఎస్.. జగన్ లకు ఉందన్నారు. వీరి నేరచరిత్ర పులివెందుల నుంచి హైదరాబాద్ వరకూ విస్తరించిందన్నారు.
ఎన్నికల వేళలో వైఎస్ ఎన్నోసార్లు దాడులు చేయించారన్న కాలవ.. జగన్ మీదా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఐదారు జీపుల్లో సింహాద్రిపురం పోలీస్ స్టేషన్ పైకి వెళ్లి రౌడీలతో దౌర్జన్యం చేయించి ఎస్ఐపై దాడికి పాల్పడ్డారన్న ఆరోపణలు చేశారు. నాడు జరిగిన సంఘటనగా చెప్పిన కాలవ.. రాజశేఖర్ రెడ్డి కొడుకునైన తననే లెక్క చేయరా? అంటూ స్టేషన్ లో వీరంగాన్ని జగన్ క్రియేట్ చేశారని.. అతడికి భయపడి అప్పటి ఎస్ఐ లాకప్ లో దాక్కున్నట్లుగా చెప్పారు. ఇంతకూ ఆ ఎస్ఐ చేసిన పనేమంటే.. చట్టవిరుద్ధంగా గన్లతో వేట సాగిస్తున్న కొందరిని పోలీసులు అరెస్టు చేయటంతో.. అందుకు ప్రతిగా జగన్ వీరంగం వేశారన్నారు. పాలెగాళ్ల రాజ్యం పుస్తకంలో జగన్ నేర చరిత్ర కూడా ఉందన్నారు.
వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక అనంతపురం జిల్లాలో పరిటాల రవి సహా మొత్తం 56 మంది టీడీపీ కార్యకర్తలను.. సానుభూతిపరులను హత్య చేశారన్నారు. శ్రీనివాసులు అనే వ్యక్తిని పెట్రోల్ పోసి తగలబెట్టారని గుర్తు చేశారు. ఎన్నికల్లో పదకొండు సీట్లకు పరిమితమైనా రప్పా.. రప్పా అంటూ ఇప్పటికి జగన్ లో మార్పు రాలేదన్నారు. మూడు తరాల జగన్ కుటుంబ రక్తచరిత్రతో లక్షల కోట్లు సంపాదించిన చరిత్ర జగన్ సొంతమన్న విషయాన్ని మర్చిపోకూడదన్నారు. కాలువ చేసిన సంచలన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి.
Gulte Telugu Telugu Political and Movie News Updates