జగన్ డిక్లరేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు

తిరుమల శ్రీవారి ఆలయానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి పై దాఖలైన డిక్లరేషన్ కేసును హైకోర్టు కొట్టేసింది. ఈమధ్యనే తిరుమల బ్రహ్మోత్సవాలు జరిగాయి. ఆ సందర్భంగా శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించిన జగన్ డిక్లరేషన్ ఇవ్వకుండానే స్వామివారి ఆలయంలోకి ప్రవేశించారంటూ గోల మొదలైంది. ఈ విషయంపై జగన్ తో పాటు మంత్రులు కొడాలినాని, వెల్లంపల్లి శ్రీనివాస్, ఈవో అనీల్ కుమార్ సింఘాల్, టీటీడీ ట్రస్టుబోర్డు ఛైర్మన్ వైవి సుబ్బారెడ్డిలను పదవుల నుండి తొలగించాలంటు కోర్టులో కేసు వేశారు.

ఈ కేసును విచారించిన హైకోర్టు కేసును కొట్టేసింది. ఆలయంలోకి ప్రవేశించేటపుడు జగన్ డిక్లరేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదని హైకోర్టు స్పష్టంగా చెప్పేసింది. జగన్ క్రైస్తవుడనేందుకు ఆధారాలను పిటీషనర్ ఇవ్వలేదని అలాగే స్వయంగా టీటీడీ ఆహ్వానం మేరకే జగన్ పట్టువస్త్రాలు సమర్పించేందుకు వచ్చారు కాబట్టి నిబంధనలు వర్తించవని కూడా స్పష్టంగా తేల్చేచింది.

ఇక చర్చిలకు, వెళ్ళినా, బైబిల్ ను పట్టుకుని ప్రార్ధనలకు వెళ్ళినా లేదా సువార్త కూటములకు హాజరైనంత మాత్రాన సదరు వ్యక్తిని క్రిస్తియన్ అని ఎలా చెబుతారంటూ నిలదీసింది. ఈమధ్యనే విజయవాడలో జరిగిన గురుద్వారా ప్రార్ధనల్లో జగన్ పాల్గొన్న విషయాన్ని కోర్టు గుర్తుచేసింది. గురుద్వారాకు వెళ్ళి ప్రార్ధనల్లో పాల్గొన్నంత మాత్రాన జగన్ సిక్కు అయిపోయినట్లేనా అని పిటీషనర్ ను నిలదీసింది.

చర్చి ప్రార్ధనల్లో పాల్గొనటం, బైబిలుకు సంబంధించిన పేరు పెట్టుకోవటం, ఇంట్లో శిలువ ఉండటం కారణంగా సదరు వ్యక్తిని క్రిస్తియన్ అనుకునేందుకు లేదని కోర్టు స్పష్టం చేసేసింది. ఎవరైనా హైందవేతురులు వ్యక్తిగత హోదాలో తిరుమల ఆలయానికి వెళ్ళినపుడు మాత్రమే టీటీడీ చట్టంలోని 136వ నిబంధన ప్రకారం డిక్లరేషన్ ఇవ్వాలని స్పష్టంగా చెప్పింది. కోర్టు తాజా తీర్పుతో జగన్ పై ఉన్న డిక్లరేషన్ వివాదం ముగిసినట్లే అనుకోవాలి.