రాజ్యసభ స్థానాలు అప్పుడే రిజర్వ్ అయిపోయాయా?

రాష్ట్రంలో కీలకమైన నాలుగు రాజ్యసభ ఖాళీ అవుతున్నాయి. వీటిలో మూడు వైసీపీకి చెందిన నాయకులవి కాగా ఒకటి టిడిపికి చెందిన సానా సతీష్ ప్రాతినిధ్యం వహిస్తున్న స్థానం. వచ్చే నెల 21తో ఈ నాలుగు స్థానాలకు గడువు తీరుతుంది. ఈ నేపథ్యంలో ఈ నెల ఆఖరి నాటికి రాజ్యసభ ఎన్నికలకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేయనుంది.

ఇప్పుడు ఉన్న అసెంబ్లీ బలాలను బట్టి ఈ నాలుగు స్థానాలు తిరిగి టిడిపికి దక్కనున్నాయి. ఈ క్రమంలో ఆయా స్థానాలు ఎవరికి కేటాయిస్తారు ఎవరిని పెద్దల సభకు పంపిస్తారు అనే విషయం ఆసక్తిగా మారింది. ప్రధానంగా గతంలో టికెట్లను త్యాగం చేసిన వారిలో దేవినేని ఉమామహేశ్వరరావు ముందు వరుసలో ఉన్నారు. తనకు రాజ్యసభ అవకాశం కల్పించాలని ఆయన కోరుతున్నారు. అదేవిధంగా మాజీ మంత్రి సీనియర్ మోస్ట్ నాయకుడు యనమల రామకృష్ణుడు కూడా ఈ జాబితాలోనే ఉన్నారు.

వీరితో పాటుగా వైసీపీ నుంచి వచ్చి టిడిపిలో చేరిన మోపిదేవి వెంకటరమణ కూడా ఆశిస్తున్నట్టు తెలుస్తోంది. ఇక నారా లోకేష్ విధేయుడైన సానా సతీష్ కు తిరిగి రాజ్యసభకు పంపిస్తారని ప్రచారం జరుగుతోంది. ఇవన్నీ ఇలా ఉంటే ఈ నాలుగు స్థానాల్లో ఒకటి ఇప్పటికే ముస్లిం సామాజిక వర్గానికి రిజర్వు చేశారని ఈ స్థానం నుంచి బలమైన నాయకుడిగా ఉన్న ఎం ఏ షరీఫ్ ను పంపిస్తారని తెలుస్తోంది.

మరోవైపు గతంలో రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వర్ల రామయ్య కూడా సీటు ఆశిస్తున్నారు. ఇవన్నీ ఇలా ఉంటే కూటమి పక్షాన ఒక సీటును జనసేన మరో సీటును బిజెపి కోరుకుంటున్నాయి. ఇవి పోగా మిగిలిన రెండు స్థానాల్లో ఒకటి సానా సతీష్ కు రిజర్వు చేశారని ప్రచారం జరుగుతుంది.

మరొకటి ముస్లిం సామాజిక వర్గానికికేటాయిస్తున్నారని కూడా తెలుస్తోంది. దీంతో ఉన్న నాలుగు స్థానాలు అప్పుడే రిజర్వ్ అయిపోయాయి అనేది ఒక వాదన వినిపిస్తుండగా లేదు ఇంకా ఖరారు కాలేదని మరికొంద‌రు చెబుతున్నారు. ఏది ఏమైనా ప్రస్తుతం రాజ్యసభ సీట్ల వ్యవహారం టిడిపిలో ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.