ఏపీలో టీడీపీ సారథ్యంలో కొనసాగుతున్న కూటమి సర్కారు దూకుడు ప్రదర్శిస్తోంది. రాష్ట్రాన్ని అభివృద్ది బాట పట్టించే విషయంలో ప్రత్యేకించి రాష్ట్రానికి పెట్టుబడులు రాబట్టడంలో కూటమి సర్కారు మామూలు స్పీడుతో వెళ్లడం లేదు. జెట్ స్పీడుతో వెళుతోంది. ఇందుకు నిదర్శనమే శ్రీ సత్యసాయి జిల్లా. పుట్టపర్తిలో శుక్రవారం శంకుస్థాపన చేసుకున్ని ఏఎంసీఏ పరిశ్రమ. రూ.15,800 కోట్ల వ్యయంలో ఏర్పాటు కానున్న ఈ రక్షణ శాఖ పరిశ్రమను కూటమి సర్కారు కేవలం రోజుల వ్యవధిలోనే సాదించింది. కేవలం 36 రోజుల్లోనే ఈ పరిశ్రమను గ్రౌండ్ చేసి కూటమి సర్కారు తన స్పీడు ఏ పాటిదో ఇట్టే చెప్పేసింది.
రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తో కలిసి ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఈ పరిశ్రమకు శుక్రవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా రాయలసీమలో ఏర్పాటు అవుతున్న ఈ పరిశ్రమను ఎలా సాదించామన్న విషయాన్ని ఆయన సోదాహరణంగా వివరించారు.
కేవలం 36 రోజుల వ్యవధిలోనే ఈ పరిశ్రమను సాధించడంతో పాటుగా ఏకంగా భూమి పూజ కూడా చేస్తున్నామని ఆయన వెల్లడించారు. చెప్పడానికేముంది…అందరూ అలా గొప్పలు చెప్పుకుంటారులే అనుకోవడానికి ఇక్కడ ఆస్కారమే లేదని చెప్పాలి. ఎందుకంటే… తేదీలతో సహా చంద్రబాబు ఈ పరిశ్రమ కోసం చేసిన పనులను ఏకరువు పెట్టారు.
రక్షణ శాఖ తయారు చేసే ఫైటర్ జెట్ విమానాలను పరీక్షించేందుకు ఓ భారీ యంత్రాంగాన్ని రూపుదిద్దేందుకు నిర్ణయించిందన్న సమాచారం తెలిసిన వెంటనే చంద్రబాబు రంగంలోకి దిగిపోయారు. గత నెల (ఏప్రిల్) 9న దీనిపై రక్షణ శాఖ ప్రతినిధులతో ఏపీ ప్రభుత్వం చర్చలు జరిపింది.
ఏపీ ఆఫర్ ను పరిశీలించిన రక్షణ శాఖ… ఏపీలో ఈ పరిశ్రమకు అనుకూలంగా ఏమున్నాయన్న విషయాన్ని తెలుసుకునేందుకు ఏప్రిల్ 20న ప్రతిపాదనలు పంపాలంటూ ఏపీకి లేఖ రాసింది. రక్షణ శాఖ అడిగిన నాలుగంటే నాలుగు రోజుల్లో అంటే… ఏప్రిల్ 24న ఏపీ సర్కారు ప్రతిపాదనలు సిద్ధం చేసి రక్షణ శాఖకు పంపింది.
ఏపీ పంపిన ప్రతిపాదనల పరిశీలనకు రక్షణ శాఖ ఓ నాలుగు రోజుల సమయాన్ని తీసుకుంది. ఈ నాలుగు రోజుల్లోనూ ఏపీ సర్కారు ఖాళీగా ఏమీ కూర్చోలేదు. నిత్యం రక్షణ శాఖ ప్రతినిధులతో చర్చలు జరుపుతూనే ఉంది. ఈ క్రమంలో ఏప్రిల్ 28 ఈ పరిశ్రమను ఏపీ ప్రతిపాదించినట్లుగా పుట్టపర్తిలో ఏర్పాటు చేసేందుకు రక్షణ శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
ఆ మరునాడే అంటే.. ఏప్రిల్ 29న రక్షణ శాఖ అధికారులు పుట్టపర్తిలోని ప్రతిపాదిత స్థలాన్ని పరిశీలించారు. రక్షణ శాఖ అధికారులు ఓకే అన్నంతనే ఏప్రిల్ 30న ఏపీ ఈ పరిశ్రమ ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇక పరిశ్రమ ఏర్పాటుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను శరవేగంగా పూర్తి చేసి శుక్రవారం అంటే…మే 15న శంకుస్థాపన చేశారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates
