‘కరూర్’ మృతుడి తల్లి పాదాలు తాకిన విజయ్

తమిళనాడు నూతన ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ రాజకీయ తెరంగేట్రం ఆదిలోనే కష్టనష్టాలను చవిచూసింది. ఎన్నికలకు కాస్తంత ముందుగా కరూర్ లో ఆయన నిర్వహించిన రోడ్ షో 41 మంది ప్రాణాలను బలిగొంది. ఈ ఘటనతో విజయ్ రాజకీయం ఇక ముగిసినట్టేనని అంతా అనుకున్నారు. అయితే ఏమాత్రం ధైర్యం వీడని విజయ్ అలా ముందుకు సాగారు. ఏకంగా తమిళనాడు సీఎంగా పదవి చేపట్టారు.

అయితే కరూర్ ఘటన విజయ్ ని ఎంతగా వేధించిందో తెలిపే ఘటన ఒకటి చోటుచేసుకుంది. కరూర్ తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోయిన ఓ చిన్నారి బాలుడి కుటుంబాన్ని పరామర్శించిన సందర్భంగా మనోవేదనను ఆపుకోలేక విజయ్… ఆ బాలుడి తల్లి పాదాలపై పడి క్షమాపణ వేడుకున్నారట.

విజయ్ సీఎం అయిన నేపథ్యంలో పలు జాతీయ, అంతర్జాతీయ మీడియా సంస్థలు విజయ్ ప్రస్థానానికి సంబంధించిన ప్రత్యేక కథనాలను ప్రచురిస్తున్నాయి. అందులో భాగంగా బీబీసీ మీడియా కరూర్ తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోయిన ఓ బాలుడి కుటుంబాన్ని కలిసింది.

ఈ సందర్భంగా సదరు మీడియా ప్రతినిధి ముందు ఆ బాలుడి తండ్రి…విజయ్ గొప్పతనాన్ని, కరూర్ ఘటన విజయ్ ని ఎంతగా బాధించిందన్న విషయాన్ని కళ్లకు కడుతూ కొన్ని ఆసక్తికర విషయాలు వెల్లడించారు. తమను పరామర్శించిన సందర్భంగా కుర్చీలో కూర్చున్న తన భార్య కాళ్లను తాకిన విజయ్.. కరూర్ తొక్కిసలాటకు కారణమైన తనను మన్నించాలని వేడుకున్నారట.

అల్లారుముద్దుగా పెంచుకుంటున్న చిన్నారి కుమారుడు తొక్కిసలాటలో చనిపోగా… ఆ కుటుంబం తీరని మనోవేదనకు గురైంది. అయినా గానీ… ఎన్నికల్లో ఆ చిన్నారి తల్లిదండ్రులు విజయ్ పార్టీకి ఓటేశారట. ఎన్నికల ప్రచారంలో చెప్పినట్లుగా విజయ్ చేస్తే..మరోసారి ఆయనను గెలిపించేందుకు తాము సిద్ధంగానే ఉన్నట్లు ఆ బాలుడి తండ్రి విస్పష్ట వ్యాఖ్యలు చేశారు.

బిడ్డను కోల్పోయిన వేదన తమను ఇంకా వేదిస్తూనే ఉందని చెప్పిన ఆయన…తామంతా ఏం జరగాలని కోరుకున్నామో అలాగే జరిగి విజయ్ సీఎం అయ్యారని ఆయన పేర్కొన్నారు. సీఎంగా విజయ్ మంచి చేస్తారనే నమ్మకం తమకు ఉందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.

బిడ్డను కోల్పోయిన తమ వేదన తీరేది కాదన్న ఆ తండ్రి… విజయ్ తమకు అందించిన ఆర్థిక సాయాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఘటన జరిగాక తమను విజయ్ తమ ఇళ్లకు వచ్చి మరీ ఓదార్చాలని భావించారని, అయితే పోలీసుల అనుమతి లేని కారణంగా రాలేకపోతున్నానని విజయ్ చెప్పారన్నారు.

త్వరలోనే తాను కరూర్ వచ్చి…నాడు ప్రాణాలు కోల్పోయిన వారందరి కుటుంబాలను ప్రత్యేకంగా కలుస్తానని కూడా విజయ్ చెప్పారని ఆయన తెలిపారు. ఇక బిడ్డను కోల్పోయిన తన భార్యకు ఓ చెవి పనిచేయదని, ఆమకు ఓ ఆపరేషన్ చేయిస్తే బాగుంటుందని ఆ తండ్రి అభిప్రాయపడ్డారు.

ఇవన్నీ ఒక ఎత్తు అయితే…బిడ్డను కోల్పోయి పుట్టెడు దు:ఖంలో ఉన్న తన భార్య కాళ్లను విజయ్ తాకారని, క్షమించాలని వేడుకున్నారని ఆ తండ్రి చెప్పిన మాటలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.