అనుకున్నంతా అయ్యింది. పెట్రోల్, డిజిల్ ధరలు భారీగా పెరుగుతాయంటూ గత కొంతకాలంగా జరుగుతున్న ప్రచారం శుక్రవారంతో నిజమయ్యాయి. దేశవ్యాప్తంగా శుక్రవారం ఉదయం 6 గంటల నుంచి పెట్రోల్, డీజిల్ ధరలను పెంచిన చమురు సంస్థలు.. వాటిని ఏమాత్రం ఆలస్యం చేయకుండానే అమల్లోకి పెట్టేశాయి.
పెట్రోల్, డీజిల్ పై లీటరు రూ.3 చొప్పున పెంచుతున్నట్లు చమురు సంస్థలు ప్రకటించాయి. ఇక సీఎన్జీ ధరలను కూడా కిలోకు రూ.2 చొప్పున పెంచుతూ గ్యాస్ కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. ఇదిలా ఉంటే… ఏపీలో డీజిల్ ధర ముచ్చటగా సెంచరీ మార్కు దాటేసింది.
ఇరాన్, అమెరికా యుద్ధం నేపథ్యంలో పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా ముడి చమురు లభ్యత భారీగా తగ్గిపోయింది. ఫలితంగా ఇంధనం, గ్యాస్ లభ్యతకు తీవ్ర కొరత తప్పదన్న వాదనలు వినిపించాయి. అయితే దేశంలో అవసరాలకు సరిపడ నిల్వలు ఉన్నాయని, సమీప భవిష్యత్తుల్లో ఇంధన ధరలను పెంచేది లేదని కేంద్రం పదే పదే ప్రకటనలు చేసిన సంగతి తెలిసిందే.
అయితే పశ్చిమాసియా ఉద్రిక్తతలు తగ్గని నేపథ్యంలో ఇప్పటికే వాణిజ్య గ్యాస్ సిలిండర్ రేట్లను భారీగా పెంచేసిన కేంద్రం… తాజాగా పెట్రోల్, డీజిల్ రేట్లనూ పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది.
పెరిగిన ధరల ప్రకారం ఆయా రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ రేట్లలో స్వల్ప వ్యత్యాసాలు ఉన్నా… అన్ని చోట్ల దాదాపుగా లీటర్ పై రూ.3 మేర ధర పెరిగింది. పెరిగిన ధరతో ఏపీలోని దాదాపుగా అన్ని ప్రాంతాల్లో లీటర్ డీజిల్ ధర రూ.100 దాటేసింది.
ఏపీలో లీటర్ పెట్రోల్ పై రూ.3.29, డీజిల్ పై రూ.3.14 పెంచగా… తెలంగాణలో ఈ రేట్లు రూ.3 మేర పెరిగాయి. ఏపీలో మొన్నటిదాకా ఏపీలో లీటర్ డీజిల్ ధర రూ.97గా ఉండగా.. ఇప్పుడు ఈ ధర తాజా పెంపుతో సెంచరీ కొట్టేసింది. ఇక పెట్రోల్ అయితే ఏపీలో రూ.111 దాటేసింది. అదే తెలంగాణలో అయితే లీటర్ డీజిల్ ధర రూ.98గా ఉంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates
