రండి బాబూ రండి.. డబ్బులిచ్చి జైల్లో ఉండండి

జైలు.. ఈ మాట వినగానే సామాన్యులకు వామ్మో అనిపిస్తుంది. అక్కడి పరిస్థితుల గురించి అనుభవం ఉన్న వాళ్లు చెబుతుంటే.. సినిమాల్లో చూపించే విషయాలను గమనిస్తే భయం కలుగుతుంది. జైలుకు వెళ్లాల్సిన పరిస్థితి వస్తే ఎవ్వరైనా బెంబేలెత్తిపోతారు.

కానీ అలాంటి చోటికి డబ్బులు పెట్టుకుని ఎవరైనా వెళ్తారా? కానీ దీన్ని శిక్షగా భావించకుండా.. జస్ట్ ఒక ఎక్స్‌పీరియర్స్‌గా భావించి జైలు సందర్శనకు రండి అంటున్నారు హైదరాబాద్‌లోని చంచల్‌గూడ జైలు అధికారులు. ఈ జైలు ఎంత ఫేమస్ అన్నది కొత్తగా చెప్పాల్సిన పని లేదు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో 16 నెలల పాటు జైలు జీవితం గడిపింది ఇక్కడే.

జగన్ వల్లే ఈ జైలు బాగా పాపులర్ అయిందన్నది వాస్తవం. ఇప్పుడీ జైల్లో ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారు అధికారులు. ఇక్కడ నేరస్థులకు కాకుండా.. ప్రత్యేకంగా సందర్శకుల కోసం ఒక బ్యారక్ ఏర్పాటు చేశారు. జైల్లో పరిస్థితులు ఎలా ఉంటాయి.. అక్కడ ఉన్న వారి జీవితం ఎలా సాగుతుంది అన్నది అనుభవ పూర్వకంగా తెలుసుకోవాలంటే రూ.500 కట్టి ఈ జైల్లోకి ఎంటర్ కావచ్చు.

ఫీజు కట్టి జైల్లో వెళ్లాక 24 గంటల పాటు అక్కడే ఉండాలి. ఖైదీలకు ఎలాంటి గదులిస్తారు.. వాళ్లకు సౌకర్యాలు ఎలా ఉంటాయి.. ఖైదీల దిన చర్య ఎలా ఉంటుంది.. వాళ్లక్కడ ఎలాంటి పనులు చేస్తారు.. వివిధ రకాల ఖైదీలను జైలు సిబ్బంది ఎలా ట్రీట్ చేస్తారు.. ఇవన్నీ పరిశీలించే అవకాశం ఉంటుంది. రాత్రి పడుకోవడానికి ఖైదీల తరహాలోనే గదులు ఉంటాయి.

దీంతో పాటు జైల్లోని మ్యూజియంను కూడా సందర్శించవచ్చు. ఐతే ఒకసారి లోపలికి వెళ్లాక 24 గంటల పాటు అక్కడ ఉండలేక, వెనక్కి వచ్చేయాలంటే మాత్రం రూ.1000 ఫైన్ కట్టాల్సి ఉంటుంది. ఇది వినోదం కోసం కాదని.. జైలు జీవితం ఎలా ఉంటుందో సామాన్య ప్రజల్లో అవగాహన కల్పించడానికే ఈ కార్యక్రమం ప్రవేశపెట్టామని తెలంగాణ జైళ్ల శాఖ అధికారులు చెబుతున్నారు.