పిఠాపురం విద్యార్థులకు పవన్ వరం

ఉమ్మ‌డి తూర్పు గోదావ‌రి జిల్లాలోని పిఠాపురం నియోజ‌క‌వ‌ర్గం నుంచి ప్రాతినిధ్యం వ‌హిస్తున్న ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ తాజాగా సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. ఈ నిర్ణ‌యంతో నియోజ‌క‌వ‌ర్గంలోని ప‌దో త‌ర‌గ‌తి విద్యార్థుల పంట పండి న‌ట్టు అయింది.

ఇటీవ‌ల విడుదైల‌న ప‌దోత‌ర‌గ‌తి ప‌రీక్ష‌ల్లో ప్ర‌భుత్వ పాఠ‌శాలల‌కు చెందిన విద్యార్థులు ప‌లువురు టాప్ మార్కులు సంపాయించుకున్నారు. వీరి విష‌యాన్ని అధికారులు ప‌వ‌న్ దృష్టికి తీసుకువెళ్లారు. వీరంతా పేద కుటుంబాల నుంచి వ‌చ్చిన వారేన‌ని.. చాలా క‌ష్ట‌ప‌డి చ‌దువుకున్నార‌ని వివ‌రించారు.

దీంతో ఆయా విద్యార్థుల ఉన్న‌త చ‌దువుల‌కు ప‌వ‌న్ క‌ల్యాణ్ తాజాగా భ‌రోసా క‌ల్పించారు. ఇక నుంచి వారి చ‌ద‌వులకు అయ్యే వ్య‌యం.. దుస్తులు, పుస్త‌కాలు ఇలా అన్నీ తానే పెట్టుకుంటాన‌ని ప‌వ‌న్ క‌ల్యాణ్ తేల్చి చెప్పారు. పిఠాపురం నియోజ‌క‌వ‌ర్గంలో మొత్తం 31 మంది విద్యార్థులు 600 మార్కుల‌కు గాను.. 580 మార్కులు సంపాయించుకున్నారు.

ఇప్పుడు వీరి ఉన్న‌త చ‌దువుల బాధ్య‌త‌ల‌ను ప‌వ‌న్ క‌ల్యాణ్ తీసుకుంటారు. వారికి ఇష్ట‌మైన కోర్సుల్లో చేర్పించ‌డంతోపాటు..చ‌దువు పూర్త‌య్యే వ‌ర‌కు అయ్యే ఖ‌ర్చును కూడా ఆయ‌నే పెట్టుకుంటారు. ఇదంతా వ్య‌క్తిగ‌త సొమ్ము నుంచి ఖ‌ర్చుచేయాల‌ని ఆయ‌న నిర్ణ‌యించుకున్న‌ట్టు అధికారులు తెలిపారు.

పిఠాపురానికి చెందిన 31 మంది విద్యార్థులలో కొంద‌రు.. 598 మార్క‌లు కూడా సంపాయించుకున్నారు. వీరి స్టేట్ టాప‌ర్లుగా నిలిచారు. మిగిలిన వారు 580 మార్కులు తెచ్చుకున్నారు. దీంతో వీరి చ‌దువులు కేవ‌లం సొమ్ము లేద‌న్న‌కార‌ణంగానో.. కుటుంబాల నేప‌థ్యం స‌రిగా లేద‌న్న కార‌ణంతోనో నిలిచిపోకూడ‌ద‌న్న ఉద్దేశంతో ప‌వ‌న్ క‌ల్యాణ్ ఈ నిర్ణ‌యం తీసుకున్నారు. వారికి కోరుకున్న కాలేజీలో సీట్లు ఇప్పించ‌డ‌మే కాకుండా.. పుస్త‌కాలు.. ర‌వాణా వ్య‌యానికి అవ‌స‌ర‌మైన ఏర్పాట్లు కూడా చేశారు. దీంతో ఆయా కుటుంబాలు సంతోషం వ్య‌క్తం చేస్తున్నాయి.

అనాథ‌లు..

త‌న నియోజ‌క‌వ‌ర్గంలో త‌ల్లీదండ్రుల‌ను కోల్పోయిన అనాథ బాల‌బాలిక‌ల‌ను కూడా ప‌వ‌న్ ఆద‌రిస్తున్న విష‌యం తెలిసిందే. వారికి నెల నెలా త‌న ఎమ్మెల్యే వేత‌నం నుంచి 5 వేల రూపాయ‌ల చొప్పున కేటాయిస్తున్నారు. వీరిలో ఏడుగురు ఇప్పుడు ప‌దోత‌ర‌గ‌తిలో టాప‌ర్లుగా నిలిచారు. ఈ విష‌యంపై ప‌వ‌న్ క‌ల్యాణ్ సంతోషం వ్య‌క్తం చేశారు. వారిని కూడా ఉన్న‌త విద్య‌కు ప్రోత్స‌హించాల‌ని అధికాల‌కు సూచించారు. పిఠాపురం విద్యార్థులు ప్ర‌పంచ స్థాయిలో గుర్తింపు పొందాల‌ని ఆకాంక్షించారు.