కేంద్రంలోను.. ఢిల్లీ రాజకీయాల్లోనూ ఇప్పటి వరకు వైసీపీ కొంత మేరకు హవా చెలాయిస్తున్న విషయం తెలిసిందే. అధికారంలో ఉన్నప్పుడు ఇప్పుడు కూడా.. అదేవిధంగా వ్యవహరిస్తోంది. దీనికి కారణం.. రాజ్యసభలో బలం ఎక్కువగా ఉండడమే. అయితే.. ఇప్పుడు ఆ బలం సగానికిపైగా తగ్గిపోనుంది. దీంతో కేంద్రంలో వైసీపీ వాయిస్ పెద్దగా వినిపించే అవకాశం లేదని తెలుస్తోంది.
ప్రస్తుతం వైసీపీకి రాజ్యసభలో వైవీ సుబ్బారెడ్డి, మేడా రఘునాథ రెడ్డి, ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, పిల్లి సుభాష్ చంద్రబోస్, ఎస్.నిరంజన్ రెడ్డి, పరిమళ్ నత్వానీ.. ఇలా ఏడుగురి బలం ఉంది. అయితే.. వీరిలో పరిమళ్ నత్వానీ.. పేరుకే వైసీపీ తరఫున ఎన్నికైనా.. ఆయన రాజకీయం అంతా కూడా బీజేపీతోనే ముడి పడి ఉంది. పైగా.. అప్పుడు సీటు కోసం అంబానీతో కలిసి జగన్‌ను కలుసుకునేందుకు వచ్చారు. ఆ తర్వాత రాజ్యసభకు ఎన్నికయ్యారు.
ఇక, అప్పటి నుంచి ఇప్పటి వరకు పరిమళ్ నత్వానీ ఏపీ వైపు చూసిందేలేదు. అయినప్పటికీ.. ప్రస్తుతం ఏడుగురి బలం ఉంది. దీంతోనే కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కారు వైసీపీ విషయంలో సానుకూలంగా వ్యవహరిస్తోంది. వైసీపీ కూడా సానుకూలంగానే సహకరిస్తోంది. కానీ, ఇప్పుడు ఈ ఏడుగిరిలో ముగ్గురి పదవీ కాలం మరో 40 రోజుల్లోనే ముగిసిపోతుంది. వచ్చే నెల 21తో ముగ్గురు రాజ్యసభ సభ్యుల పదవీ కాలం ముగియనుండడంతో వైసీపీకి కేంద్రంలో ప్రాధాన్యం తగ్గడం ఖాయంగా కనిపిస్తోంది.
వీరిలో పిల్లి సుభాష్ చంద్రబోస్, పరిమళ్ నత్వానీ, ఆళ్ల అయోధ్య రామిరెడ్డి ఉన్నారు. వీరంతా వచ్చే నెల 21న రిటైర్ కానున్నారు. పైగా.. ప్రస్తుతం అసెంబ్లీలో వైసీపీ బలం కూడా లేకపోవడంతో ఈ సీట్లన్నీ.. అధికార కూటమి పార్టీలకే చెందుతాయి. ఫలితంగా రాజ్యసభలో వైసీపీ బలం నరుగురు సభ్యులకు పడిపోతుంది. దీంతో సహజంగానే రాజకీయంగా ప్రాధాన్యం తగ్గుతుందని అంటున్నారు పరిశీలకులు. వచ్చే 2029 అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ పుంజుకునే ప్రయత్నం చేస్తే తప్ప.. మళ్లీ పెద్దల సభపై ఆశలు ఉండవని చెబుతున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates