బండి భగీరథ్ కేసు ఫిర్యాదురాలి వయసుపై ట్విస్ట్

కేంద్ర హోం శాఖ సహాయం మంత్రి బండి సంజయ్ తనయుడు బండి భగీరథ్ పై పోక్సో కేసు నమోదైన సంగతి తెలిసిందే. అయితే, కేసు నమోదై 5 రోజులు గడుస్తున్నా భగీరథ్ జాడ మాత్రం దొరకలేదు. ఈ రోజు మధ్యాహ్నం పోలీసుల విచారణకు కూడా భగీరథ్ గైర్హాజరయ్యారు. దీంతో, పోలీసుల తీరుపై, రేవంత్ సర్కార్ పై సోషల్ మీడియాలో తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి.

ఈ నేపథ్యంలోనే తాజాగా తనకు పోలీసులు ఇచ్చిన నోటీసులపై బండి భగీరథ్ స్పందించారు. తనకు 2 రోజుల సమయం కావాలని, మే 15న తన దగ్గరున్న సాక్ష్యాధారాలతో సిట్ విచారణాధికారి ముందు తాను హాజరవుతానని ఆ నోటీసులకు రిప్లై ఇచ్చారు. విచారణకు సహకరిస్తానని చెప్పారు. ఈ ప్రకారం పేట్ బషీరాబాద్ పోలీసులకు భగీరథ్ ఈ మెయిల్ మరియు లేఖ రాశారు.

అంతకుముందు, తనపై తప్పుడు కేసు నమోదు చేశారని, ముందస్తు బెయిల్‌ మంజూరు చేయాలని కోరుతూ భగీరథ్‌ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. తనపై నమోదైన పోక్సో కేసులోని ఆరోపణలను తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఆ పిటిషన్ లో పలు ఆరోపణలు చేశారు. బాధిత బాలిక వయసు 19 నుంచి 20 ఏళ్లు ఉంటాయని, కానీ ఆమె తల్లి తప్పుడు రికార్డులను సృష్టించి మైనర్‌గా చిత్రీకస్తున్నారని ఆరోపించారు.

వయసు తగ్గించి కఠినమైన పోక్సో చట్టం కింద కేసు నమోదు చేయించారని, బాధితురాలి వయసు 17 ఏళ్లు కాదని ఆరోపణలు చేశారు. 2021 ఆగస్టు 21న సదరు బాలికపై డ్రైవింగ్‌కు సంబంధించిన కేసు నమోదైందని, ఆ రికార్డుల ప్రకారం అప్పుడు ఆమెకు 15 ఏళ్లని తెలిపారు. ఆ ప్రకారం ఇప్పుడు బాధితురాలి వయసు 19 నుంచి 20 ఏళ్లు ఉంటాయని చెప్పారు.

ఈ తప్పుడు ఆరోపణలతో నమోదైన కేసులో తాను అరెస్టైతే తన కుటుంబ పరువునకు భంగం వాటిల్లుతుందని చెప్పారు. విచారణాధికారికి, కోర్టు విచారణకు పూర్తిగా సహకరిస్తానని, కోర్టు షరతులకు కట్టుబడి ఉంటానని, ఈ కేసులో తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరారు.