ఇటీవల ముగిసిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలలో టీవీకే అతిపెద్ద పార్టీగా అవతరించింది. 108 సీట్లు గెలుచుకున్న విజయ్ పార్టీ…మ్యాజిక్ ఫిగర్ కు 10 సీట్ల దూరంలో నిలిచిపోయింది. దీంతో, విజయ్ కాంగ్రెస్ తో పాటు వీసీకే, సీపీఐ వంటి చిన్న పార్టీల మద్దతులో ప్రభుత్వం ఏర్పాటు చేయాలని అనుకున్నారు. అయితే, సినీ ఫక్కీలో పొలిటికల్ థ్రిల్లర్ మూవీని తలపించేలా విజయ్ బల పరీక్ష ఎపిసోడ్ నడిచింది. ఎట్టకేలకు అందరినీ బుజ్జగించి బొటాబొటీ మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు రెడీ అయ్యారు విజయ్.
అయితే, అసెంబ్లీలో నేడు బల పరీక్ష రూపంలో విజయ్ కు అతి పెద్ద సవాల్ ఎదురైంది. తన మిత్రపక్షాలలలో సడెన్ గా ఎవరు హ్యాండిచ్చినా విజయ్ ప్రభుత్వం మైనారిటీలో పడేది. ఈ టెన్షన్ లో ఉన్న విజయ్ కు అనూహ్యంగా ఏఐడీఎంకేలో చీలిక రూపంలో బంపర్ ఆఫర్ తగిలింది. 30 మంది ఏఐడీఎంకే ఎమ్మెల్యేలు విజయ్ కు మద్దతిస్తామని ముందుకు వచ్చారు. దీంతో, ఈ రోజు బల పరీక్షలో విజయ్ సునాయాసంగా నెగ్గారు. మొత్తం 144 మంది ఎమ్మెల్యేలు మద్దతుతో టీవీకే బలపరీక్షలో గెలిచింది.
ఈ నేపథ్యంలోనే తమ ప్రభుత్వం ఐదేళ్ల పాటు పాలన సాగిస్తుందని విజయ్ అన్నారు. గత ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలు కొనసాగిస్తుందని చెప్పారు. మరోవైపు, బల పరీక్షకు ముందే తమ పార్టీ ఎమ్మెల్యేలను విజయ్ కలవడంపై ఏఐడీఎంకే ఎమ్మెల్యే, మాజీ సీఎం పళని స్వామి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. విజయ్ తమ ఎమ్మెల్యేలను డబ్బులు పెట్టి కొన్నారని ఆరోపించారు.
విజయ్ బల పరీక్షలో నెగ్గినా ఏఐడీఎంకే ఎమ్మెల్యేలను ఏ విధంగా కలుపుకొని ముందుకు పోతారు అన్నది సవాల్ గా మారింది. వారికి ఎన్ని మంత్రి పదవులిస్తారు? ఆల్రెడీ కమిట్ అయిన కాంగ్రెస్, మిగతా చిన్న పార్టీలకు ఎన్ని కేటాయిస్తారు? తనను నమ్ముకొని ఉన్న టీవీకే నేతలకు మంత్రివర్గంలో ఏ రకంగా న్యాయం చేస్తారు అన్నది విజయ్ కు పెద్ద టాస్క్ అని చెప్పవచ్చు.
Gulte Telugu Telugu Political and Movie News Updates