టీవీకే అధినేత, తమిళనాడు సీఎం విజయ్ తీసుకుంటున్న నిర్ణయాలపై ప్రశంసలు వస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా పాఠశాలలు, దేవాలయాల సమీపంలో మద్యం షాపులు తీసివేయాలన్న విజయ్ నిర్ణయంపై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తాయి. ఇక, బ్యానర్లు, ఫ్లెక్సీలు అంటూ ప్రజలకు ఇబ్బంది కలిగించే కార్యక్రమాలు చేయొద్దంటూ టీవీకే ఎమ్మెల్యేలకు హుకుం జారీ చేసిన విజయ్ రీల్ లైఫ్ మాదిరే రియల్ లైఫ్ లో పాలన సాగిస్తారని అంతా భావించారు.
అయితే, తన వ్యక్తిగత జ్యోతిష్యుడు రిక్కి రాధన్ ను తన ఓఎస్డీగా నియమించడంతో విజయ్ పై తొలి విమర్శ మొదలైంది. ఇక, నేడు అసెంబ్లీలో అయితే ఈ విషయంపై డీఎంకేతో పాటు టీవీకే మిత్రపక్షాలు కూడా విజయ్ తీరును తప్పుబట్టాయి. ఈ నేపథ్యంలోనే విజయ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఓఎస్డీగా రిక్కి రాధన్ నియామకాన్ని రద్దు చేశారు. విపక్షాల ఆరోపణలతో వెనక్కి తగ్గిన సీఎం విజయ్ ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఇటు విపక్షాలు, అటు ప్రజల నుంచి వ్యతిరేకత రావడంతో విజయ్ చాలా వేగంగా రియాక్ట్ అయ్యి చేసిన పొరపాటును సరిదిద్దుకున్నారు. ఈ విషయంలో విజయ్ తీరు అభినందనీయం.
రిక్కి రాధన్ విషయంలో పడ్డ మచ్చ మాత్రం ఎప్పటికీ చెరిగిపోదు అన్న విషయం విజయ్ గుర్తు పెట్టుకోవాలి. అయితే, ఇటువంటి పొరపాట్లు మళ్లీ రిపీట్ కాకుండా విజయ్ ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుంది. ఏది ఏమైనా రిక్కీ రాధన్ నియామకం రద్దు రూపంలో విజయ్ కు తొలి షాక్ తగిలినట్లయింది.
Gulte Telugu Telugu Political and Movie News Updates