దేశంలో గత కొంతకాలం నుంచి బీజేపీ హవా నడుస్తోంది. అయితే కొన్ని రాష్ట్రాల్లో ఆ పార్టీకి ఆశించిన మేర విజయాలు దక్కడం లేదు. ఇలాంటి రాష్ట్రాల జాబితాలో పశ్చిమ బెంగాల్ ప్రథమ స్థానంలో ఉందని చెప్పక తప్పదు. మొన్నటిదాకా బెంగాల్ ను ఏలిన తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ… కేంద్రంలోని బీజేపీ సర్కారుతో ఢీ అంటే ఢీ అన్న రీతిలో సాగారు. ప్రధాని మోదీని తన బద్ధ శత్రువుగా పరిగణిస్తున్నట్లుగా ఆమె వ్యవహారం ఉన్న సంగతి తెలిసిందే.
ఇలాంటి నేపథ్యంలో బెంగాల్ లో బీజేపీ జెండాను పాతే దిశగా మోదీ చాలా కాలంగా ఎదురు చూస్తున్నారు. తాజాగా సువేందు అధికారి బెంగాల్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తుండగా… మోదీ భావోద్వేగానికి గురయ్యారు. ఈ దృశ్యాన్ని చూస్తే.. బెంగాల్ లో విజయం కోసం మోదీ ఇంతగా తపించారా? అన్న ఆసక్తికర విశ్లేషణలు సాగుతున్నాయి.
తృణమూల్ కాంగ్రెస్ లో కీలక నేతగా, దీదీకి అత్యంత సన్నిహితుడిగా మెలగిన సువేందు అధికారి ఒకానొక సమయంలో దీదీకి హ్యాండిచ్చేసి బీజేపీ గూటికి చేరారు. ఇక్కడే పెద్ద విజయాన్ని నమోదు చేసుకున్న మోదీ… బెంగాల్ లో పాలనా పగ్గాలను చేపట్టేందుకు ఓ యాగమే చేశారు.
బెంగాల్ బాధ్యతలను తన అనుంగుడు, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాకు అప్పగించిన మోదీ… బెంగాల్ లో విజయం ఎప్పుడెప్పుడా అంటూ ఎదురు చూశారు. ఆ ఎదురు చూపులు చాలాకాలం అలా కొనసాగాయి. తాజాగా మొన్నటి 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో మోదీ, షాలు అనుకున్నట్లుగా దీదీ పార్టీకి గుడ్ బై చెప్పిన బెంగాలీలు బీజేపీకి పట్టం కట్టారు.
ఈ సందర్భంగా సువేందు అధికారి శనివారం బెంగాల్ సీఎంగా పదవీ ప్రమాణం చేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన మోదీ… బెంగాల్ లో బీజేపీకి విజయాన్ని కట్టబెట్టిన బెంగాలీలకు నమస్కారం చేశారు. అందులో భాగంగా ఆయన వేదికపై మోకాళ్లపై కూర్చని మరీ బెంగాలీలకు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ దృశ్యం చూసిన వారంతా.. బెంగాల్ లో విజయం కోసం మోదీ ఇంతగా తపించారా? అని ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే బెంగాలీలకు మోదీ ప్రణామాలకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.
Gulte Telugu Telugu Political and Movie News Updates