ప‌నిమ‌నిషి-ఆటో డ్రైవ‌ర్‌-కార్ డ్రైవ‌ర్‌… లైఫ్ మారిపోయింది

ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నిక‌ల్లో అసామాన్యులు విజ‌యం ద‌క్కించుకోవ‌డం.. వార‌సులు గెలుపు గుర్రాలు ఎక్క‌డం.. వ‌రుస విజ‌యాలు ద‌క్కించుకున్న హేమాహేమీలు విజ‌యం సాధించ‌డం తెలిసిందే. కానీ, వీరిని మించి అన్న‌ట్టుగా.. కొంద‌రు సామాన్యులు కూడా గెలుపు గుర్రం ఎక్కారు. అస‌లు రాజ‌కీయాల్లో ఊహ‌ల‌కు కూడా అంద‌ని విధంగా ఈ ద‌ఫా ప్ర‌జ‌లు సామాన్యుల‌ను గ‌ద్దెనెక్కించి.. అసెంబ్లీకి పంపించారు.

వీరిలో ఇంట్లో అంట్లు తోముకుని ప‌నిచేస్తూ.. కుటుంబాన్ని పోషించుకునే మ‌హిళ‌, ఆటో న‌డిపితే త‌ప్ప‌.. జీవితం గ‌డ‌వ‌ని సాధార‌ణ డ్రైవ‌ర్‌, మ‌రో కారు డ్రైవ‌ర్ కొడుకు ఉన్నారు. ప్ర‌స్తుతం ఈ ముగ్గురి గురించి.. పెద్ద ఎత్తున దేశ‌వ్యాప్తంగా చ‌ర్చ సాగుతోంది. ఎవ‌రు వీరు? ఎక్క‌డివారు? అంటూ.. నెటిజ‌న్లు జోరుగా సోధిస్తున్నారు. వారి జీవిత విశేషాలు తెలుసుకుంటున్నారు.

ప‌నిమ‌నిషి..

ప‌శ్చిమ బెంగాల్‌కు చెందిన క‌విత మాఝీ. 2021 వ‌ర‌కు ఇళ్ల‌లో పాచి ప‌నులు చేసుకుని కుటుంబాన్ని న‌డిపించేవారు. ఓ రోజు ఓ ఇంట్లో ప‌నిచేస్తుండ‌గా.. స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల‌కు సంబంధించిన చ‌ర్చ జ‌రుగుతోంది. ఈ చ‌ర్చ‌లో ఆమె కూడా.. భాగ‌మయ్యారు. ఇంట్లో వాళ్ల‌తో క‌లివిడిగా ఉండే.. ఆ ప‌నిమనిషి.. క‌విత‌.. కొన్ని సూచ‌న‌లు చేసింది. మీరు గెల‌వాలంటే.. ఇలా చేయండి. మాలాంటోళ్ల‌ను పట్టించుకోండి .. అంటూ స‌ల‌హాలు ఇచ్చింది. ఆ త‌ర్వాత‌.. య‌జ‌మానికి ఎందుకో.. ఆమెలో ఉన్న రాజ‌కీయ కోణం న‌చ్చి.. పార్టీ పెద్ద‌ల‌కు విష‌యం చెప్పాడు.

ఆ త‌ర్వాత‌.. ఆమె ద‌శ తిరిగిపోయింది. బీజేపీ ఆమెను చేర్చుకోవ‌డ‌మే కాదు.. 2021లో ఔస్ గ్రామ్ నియోజ‌కవ‌ర్గంలో టికెట్ కూడా ఇచ్చేసింది. అయితే.. అప్ప‌ట్లో ఆమె ఓడిపోయి.. తిరిగి ఇళ్ల‌లో ప‌నులు చేయ‌డం ప్రారంభించింది. కానీ, బీజేపీ మ‌రోసారి ఆమెను వెతికి ప‌ట్టుకుని.. తాజాగా టికెట్ ఇచ్చి.. గెలిపించుకుంది. టీఎంసీ అభ్యర్థిపై 12,535 ఓట్లతో క‌విత‌ విజయం సాధించారు. ల‌క్కు చిక్కితే.. మ‌హిళా కోటాలో ఆమెకు మంత్రి పీఠం రావొచ్చ‌న్న చ‌ర్చ కూడా జ‌రుగుతోంది.

ఆటో డ్రైవ‌ర్..

మ‌న దేశంలో ఆటో డ్రైవ‌ర్లుగా ప‌నిచేస్తూ.. గెలిచిన వారు ఉన్నారు. మ‌హారాష్ట్ర మాజీ సీఎం, ప్ర‌స్తుత ఉప ముఖ్య‌మంత్రి ఏక్‌నాథ్ షిండే.. గ‌తంలో ఆటో డ్రైవ‌రే కావ‌డం గ‌మ‌నార్హం. ఇలానే తాజాగా త‌మిళ‌నాడుకు చెందిన విజ‌య్ ధాము.. కూడా ఆటోడ్రైవ‌రే. టీవీకే అధిప‌తి విజ‌య్ అంటే ప్రాణం పెట్టేస్తాడు. ఇదే.. ఆయ‌న‌ను విజ‌య్‌కు చేరువ చేసింది.

ఓ బ‌హిరంగ స‌భ‌లో అనూహ్యంగా ధాము పేరును ప్ర‌స్తావించిన విజ‌య్‌.. ఆయ‌న‌కు టికెట్ ఇస్తున్న‌ట్టు ప్ర‌క‌టించారు. చేతిలో చిల్లిగ‌వ్వ‌లేదన్న ధామును ఓదార్చ‌డ‌మే కాదు.. ఖ‌ర్చులన్నీ విజ‌య్ భ‌వించి.. నామినేష‌న్ నుంచి గెలిపించే వ‌ర‌కు బాద్య‌త తీసుకున్నారు. ఈయ‌న రోయ‌పురం నియోజ‌క‌వ‌ర్గం నుంచి గెలుపు గుర్రం ఎక్కారు.

కారు డ్రైవ‌ర్ కుమారుడు..

టీవీకే అధినేత విజ‌య్‌.. త‌న సొంత కారు డ్రైవ‌ర్‌.. రాజేంద్ర‌న్ కుమారుడు.. శ‌బ‌రి నాథన్‌కు కూడా తాజా ఎన్నిక‌ల్లో టికెట్ ఇచ్చారు. డీఎంకే, అన్నాడీఎంకేలకు కంచుకోట వంటి విరుగంబాక్కం నియోజ‌క‌వ‌ర్గం టికెట్‌ను ఇచ్చారు. అయితే.. ఇదేదో.. అభ్య‌ర్థులు లేక విజ‌య్ పంచిపెట్టిన ప‌ప్పుబెల్లం అంటూ.. ప్ర‌త్య‌ర్థులు ఎద్దేవా చేశారు.

కానీ, క్షేత్ర‌స్థాయిలో శ్రామిక వ‌ర్గాన్ని, యువ‌త‌ను కూడ‌గ‌ట్ట‌డంలో శ‌బ‌రి నాథ‌న్ కృషి చేసి.. విజ‌యం ద‌క్కించుకున్నారు. మంత్రివ‌ర్గ రేసులో ఈయ‌న ఉన్నార‌ని తెలుస్తోంది. ఇలా.. సామాన్యుల‌ను గెలిపించి.. ప్ర‌జ‌లు ప్ర‌త్యేక తీర్పు ఇచ్చిన ఎన్నిక‌లుగా 2026 రికార్డు సృష్టిస్తోంది.