టీఆర్ఎస్.. తెలుగు నేల రాజకీయాల్లో ఇట్టే పరిచయం అక్కర్లేని పేరు. ఓ ఉద్యమ పార్టీగా ప్రయాణం మొదలుపెట్టిన టీఆర్ఎస్,,, తెలంగాణ ప్రజల కలలను సాకారం చేసింది. ఆపై తెలంగాణలో తొలిసారి అధికారం చేపట్టింది. వరుసగా రెండు పర్యాయాలు తెలంగాణను పాలించింది. ప్రస్తుతం తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షంగా కొనసాగుతోంది. అయితే ఈ క్రమంలోనే టీఆర్ఎస్ పేరును ఆ పార్టీ అదినేత బీఆర్ఎస్ మార్చారు.
తాజాగా మరోమారు టీఆర్ఎస్ తెలంగాణ రాజకీయాల్లో ఎంట్రీ ఇచ్చేసింది. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలిగా కొనసాగుతున్న కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత ప్రారంభించిన పార్టీనే ఇప్పటి టీఆర్ఎస్. తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్)గా కవిత నమోదు చేసుకున్న రాజకీయ పార్టీని కేంద్ర ఎన్నికల సంఘం గుర్తించింది.
ఇటీవలే తన తండ్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో విబేధించిన కవిత… బీఆర్ఎస్ కు, ఆ పార్టీ ద్వారా తనకు దక్కిన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. కొంతకాలం పాటు తెలంగాణ జాగృతి పేరిట కార్యక్రమాలు నిర్వహించిన కవిత…తాజాగా ఈ నెల 25న తన రాజకీయ పార్టీని ప్రకటించారు. మేడ్చల్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో తెలంగాణ రక్షణ సేన పేరిట తన పార్టీని ప్రకటించిన కవిత… గతంలో తన తండ్రి స్థాపించిన తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) ఉనికిని ప్రశ్నార్థకం చేశారు. ఎందుకంటే కేసీఆర్ పార్టీ, కవిత పార్టీల షార్ట్ ఫాంలు రెండూ టీఆర్ఎస్సే కదా. కేసీఆర్ స్థాపించిన టీఆర్ఎస్… బీఆర్ఎస్ గా మారిపోగా… తెలంగాణ ప్రజల గుండెల్లోని టీఆర్ఎస్ పేరు కవిత పార్టీకి దక్కిపోయింది.
టీఆర్ఎస్ ను అందిపుచ్చుకునే క్రమంలో కవిత అదివరకే ఓ సందర్భంలో కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యల నేపథ్యంలో ఎక్కడ తమ టీఆర్ఎస్ పేరును కవిత ఆక్రమిస్తారోనన్న భయంతో తమ పార్టీ పేరును తిరిగి టీఆర్ఎస్ గా మార్చే దిశగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మొన్నామధ్య ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అయితే కేటీఆర్ ఆ దిశగా అడుగులు ప్రారంభించేలోపే కవిత తన పార్టీ పేరును టీఆర్ఎస్ గా ప్రకటించారు. కవిత ప్రతిపాదనలకు కేంద్ర ఎన్నికల సంఘం కూడా తాజాగా ఆమోద ముద్ర వేయడంతో ఇక టీఆర్ఎస్ కవిత సొంతం అయిపోయిందని చెప్పక తప్పదు.
Gulte Telugu Telugu Political and Movie News Updates