బాబు నిద్ర పోలేదు.. వారికి నిద్ర ప‌ట్ట‌లేదు.. అంతా హ్యాపీ!

ఏపీ సీఎం చంద్రబాబు అనుకున్నది సాధించడంలో దిట్ట. అది సమస్య అయినా, లేక అభివృద్ధి కార్యక్రమమైనా.. విషయం ఏదైనా చంద్రబాబు అనుకుంటే అయిపోవాలి. ఇదే ధోర‌ణిలో ఆయన వ్యవహరిస్తున్నారు. గత నాలుగు రోజులుగా రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ సమస్య తలెత్తింది. రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున పెట్రోల్ బంకుల దగ్గర వాహనదారులు క్యూ కట్టారు. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. సోషల్ మీడియాలోనూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా.. ముఖ్యంగా చంద్రబాబు సహా మంత్రి వర్గానికి వ్యతిరేకంగా కామెంట్లు, విశ్లేషణలు వినిపించాయి. అయితే ఈ విషయంలో ఎదురు దాడి చేయడం కాకుండా విషయాన్ని విషయంగా తీసుకుని సమస్యను పరిష్కరించే దిశగా చంద్రబాబు సంచలన అడుగులు వేశారు.

సమస్య పరిష్కారం అయ్యేవరకు తాను నిద్రపోకుండా అధికారులను, జిల్లా కలెక్టర్లను నిద్ర పోనివ్వకుండా పరిస్థితిని చక్కదిద్దడంలో సక్సెస్ అయ్యారు. వాస్తవానికి రాష్ట్రంలో వారం రోజుల నుంచి పెద్ద ఎత్తున పెట్రోలు, డీజిల్ కొరతపై ప్రచారం సాగుతోంది. ఈ విషయం అధికారులకు కూడా తెలుసు. అయినప్పటికీ ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్లకుండా వ్యవహరించారనే విమర్శలు ఉన్నాయి. ఇక గత శుక్రవారం నాటికి రాష్ట్రంలో పరిస్థితి తీవ్రతరమైంది. పెట్రోలు, డీజిల్ లేక మూతపడిన బంకులు దాదాపు 500 దాకా కనిపించాయి. దీంతో రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున అలజడి రేగింది. శనివారం నాటికి ఈ పరిస్థితి మరింత తీవ్రతరంగా మారింది.

అప్పటివరకు చంద్రబాబు దృష్టికి ఈ విషయాలు వెళ్లలేదనేది వాస్తవం. ఆ తర్వాత ఆయన దృష్టిలో పడగానే వెంటనే స్పందించిన చంద్రబాబు అధికారులను ఉరుకులు పరుగులు పెట్టించారు. వాస్తవానికి రాష్ట్రంలో ఉన్న పెట్రోల్, డీజిల్ సమస్య చంద్రబాబు దృష్టికి వెళ్లేసరికి ఆయన ముంబైకి పయనం అయ్యే పనిలో ఉన్నారు. ఇటీవల ఎకనామిక్ టైమ్స్ పత్రిక బిజినెస్ రిఫార్మ‌ర్‌ ఆఫ్ ది ఇయర్ అవార్డును చంద్రబాబుకు అందించింది. ఈ అవార్డును అందుకోవడానికి ఆయన ముంబైకి బయలుదేరుతున్న సమయంలో రాష్ట్రంలో ఉన్న పరిస్థితి ఆయన చెవిలో పడింది. వెంటనే ముంబైకి చేరుకోగానే తాను బస చేసిన హోటల్ నుంచే ఆయన దీనిపై టెలికాన్ఫెరెన్స్ నిర్వహించి అధికారులను అప్రమత్తం చేశారు.

ఇక అక్కడి నుంచి వచ్చిన తర్వాత సోమవారం రోజు రోజంతా ఈ పని మీదే కూర్చున్నారు. ఉదయం ఎనిమిది గంటలకు ప్రారంభమైన టెలికాన్ఫరెన్స్ విడతల వారీగా దాదాపు 8సార్లు అధికారులతో మాట్లాడారు. బంకుల యజమానులతో చ‌ర్చించారు. ఆయిల్ కంపెనీల ప్రతినిధులతో మాట్లాడారు. ఇలా ప్రతి రెండు గంటలకు ఒకసారి టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రతి మూడు గంటలకు ఒకసారి నివేదికలు తెప్పించుకుని పరిశీలించారు. ఇక మంగళవారం వచ్చేసరికి చంద్రబాబు విశాఖపట్నంలో గూగుల్ డేటా కేంద్రాన్ని ప్రారంభించేందుకు వెళ్లారు.

అక్కడికి వెళ్లిన తరువాత కూడా మంగళవారం ఉదయం 6 గంటలకు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. మరోసారి 9 గంటలకి అధికారులతో మాట్లాడారు. డీజిల్, పెట్రోల్ సమస్యపై నిరంతరం అధికారులను ప‌రుగులు పెట్టించారు. రాత్రి వేళల్లో కూడా పెట్రోలు, డీజిల్ రవాణా జరగాల్సిందేనని ఆదేశించారు. ఆ విధంగానే పనులు చేయించారు. తద్వారా మంగళవారం మధ్యాహ్నం రెండు గంటల సమయానికి రాష్ట్రవ్యాప్తంగా పరిస్థితి కుదుటపడింది. అప్పటివరకు బంకుల ముందు భారీ ఎత్తున కనిపించిన క్యూలైన్లు తగ్గిపోయాయి. సరఫరా పెరిగింది. బంకుల్లో నో స్టాక్ బోర్డులు కూడా తీసేశారు.

మొత్తం గా ఈ పరిణామాలను చూస్తే సమస్య వచ్చినప్పుడు ఏ విధంగా వ్యవహరించాలి అనే అంశంలో చంద్రబాబు మరోసారి తన పాత విధానాలను అనుసరించారు. తాను నిద్రపోలేదు, అధికారులకు నిద్ర పట్టలేదు.. అన్న విధంగా సమస్య పరిష్కారం అయ్యేవరకు వెంటపడి పూర్తి చేశారు. తద్వారా రాష్ట్రవ్యాప్తంగా పెట్రోలు, డీజిల్ సమస్య సమసి పోగా… అందరూ ఇప్పుడు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు.