నవ్యాంద్రప్రదేశ్ లో అధికార కూటమి రథ సారథి తెలుగు దేశం పార్టీ (టీడీపీ)లో బుదవారం నుంచి నవ శకం మొదలు కానుంది. నిన్నటిదాకా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి పదవిలో కొనసాగిన టీడీపీ యువ నేత, ఏపీ కేబినెట్ లో కీలక శాఖలను పర్యవేక్షిస్తున్న మంత్రి నారా లోకేశ్ బుధవారం పార్టీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడి (నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్)గా కొత్త పదవిలో చేరిపోతున్నారు. వెరసి పార్టీలో నారా లోకేశ్ నాయకత్వం రూపేణా పార్టీలో నవ యువ శకం మొదలైనట్టేనన్న వాదనలు వినిపిస్తున్నాయి.
పార్టీలో చాలా కాలం నుంచి అత్యంత కీలకంగా వ్యవహరిస్తున్న లోకేశ్… 2024 ఎన్నికల్లో జనసేన, బీజేపీలతో జత కట్టిన టీడీపీని విజయ తీరాలకు చేర్చారు. ఎన్నికలకు ముందు యువగళం పేరిట లోకేశ్ చేపట్టిన యువ గళం పాదయాత్రకు భారీ స్పందన లభించింది. అంతేకాకుండా పార్టీని ప్రజల్లోకి మరింత చొచ్చుకెళ్లేలా ఈ యాత్ర చేసిందని చెప్పక తప్పదు. నాడు అధికారంలో ఉన్న వైసీపీ సాగించిన పాలనలోని లోటుపాట్లను ఎత్తిచూపుతూ సాగిన లోకేశ్… జనంలో వైసీపీని పలుచన చేుయడంలో సఫలీకృతమయ్యారు. ఫలితంగా అప్పటిదాకా 151 సీట్లతో అత్యంత బలంగా ఉన్న వైసీపీని 11 సీట్లకు పరిమితం చెయ్యడంలో కీలక పాత్ర పోషించారు.
రాజకీయాల్లోకి వచ్చీరావడంతోనే టీడీపీ కార్యకర్తల సంక్షేమం అంటూ లోకేశ్ తీసుకున్న చర్య పార్టీ కేడర్ ను ఎంతగానో ఆకట్టుకుంది. ఏదేనీ అనుకోని కారణం చేత పార్టీ కార్యకర్త మరణిస్తే… వారి కుటుంబాలు అనాథలుగా మిగలకుండా… కార్యకర్తలకు బీమా సౌకర్యాన్ని కల్పిస్తూ లోకేశ్ తీసుకున్న నిర్ణయం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అంతేకాకుండా కేడర్ కు బీమా సౌకర్యాన్ని అందించే దిశగా దాదాపుగా అన్ని పార్టీలు లోకేశ్ చూపిన బాటలో నడిచిన టీడీపీనే అనుసరించాల్సి వచ్చింది. ఆ తర్వాత టీడీపీ ప్రభుత్వ హయాంలో ఎమ్మెల్సీగా, మంత్రిగా లోకేశ్ చురుకైన పాత్రను పోషించారు.
2019 ఎన్నికల్లో వైసీపీ చేతిలో ఘోర పరాభవాన్ని చవిచూసిన టీడీపీని.. ఐదేళ్ల స్వల్ప వ్యవధిలోనే ఓ రేంజిలో బలోపేతం చేసే దిశగా లోకేశ్ తీసుకున్న చర్యలు ఫలితాన్నిచ్చాయి. వైసీపీ పాలనలో టీడీపీ కేడర్ భయభ్రాంతులకు గురి కాకుండా ఉండేలా లోకేశ్ ధైర్యంగా ముందుకు సాగారు. కేడర్ కు వెన్నుదన్నుగా నిలిచారు. ఈ క్రమంలోనే రెడ్ బుక్ పేరిట ఆయన నోట నుంచి వచ్చిన మాట కేడర్ లో సరికొత్త ఉత్సాహాన్ని నింపిందని చెప్పాలి. ఇవన్నీ బేరీజు వేసిన పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు… లోకేశ్ కు ప్రమోషన్ ఇచ్చారు. పార్టీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్ష పదవిని లోకేశ్ కు అప్పగించిన బాబు… పార్టీ బాద్యతలను పూర్తిగా లోకేశ్ కు అప్పగించారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates