విజయ్ నియోజకవర్గంలో రాత్రి 1 వరకు ఓటింగ్…

త‌మిళ‌నాడు అసెంబ్లీ ఎన్నికల ఓటింగ్ ప్ర‌క్రియ ప్ర‌శాంతంగా జ‌రిగింది. వాస్త‌వానికి గ‌తంలో కొన్ని కొన్ని చెదురుమొదురు ఘ‌ట‌న‌లు జ‌రిగేవి. తాజాగా జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఆ ఘ‌ట‌న‌ల‌కు కూడా అవ‌కాశం లేకుండా ఎన్నికల సంఘం ప‌క్కా ఏర్పాట్లు చేసింది. దీంతో క‌నీవినీ ఎరుగ‌ని రీతిలో ఓటింగ్ న‌మోదైంది. 88.9 శాతం(శుక్ర‌వారం తెల్ల‌వారు జామున ప్ర‌క‌టించిన లెక్క ప్ర‌కారం) ఓటింగ్ న‌మోదైంది.

ఇప్ప‌టి వ‌ర‌కు ఈ రేంజ్‌లో ఓట్లు పోలింగ్ కావ‌డం ఇదే తొలిసారి అని ఎన్నిక‌ల సంఘం అధికారులు ప్ర‌క‌టించారు. దీనికితోడు.. సుమారు 52 నియోజ‌క‌వ‌ర్గాల్లో అర్ధ‌రాత్రి 12 వ‌ర‌కు 12నియోజ‌క‌వ‌ర్గాల్లో రాత్రి 2 గంట‌ల వ‌ర‌కు కూడా ఓట్లు వేశార‌ని తెలిపారు. ముఖ్యంగా టీవీకే అధ్య‌క్షుడు, ద‌ళ‌ప‌తి విజ‌య్ పోటీలో ఉన్న పెరుంబూరు, తిరుచ్చి స్థానాల్లో రాత్రి 1 గంట వ‌ర‌కు పోలింగ్ జ‌రిగిన‌ట్టు తెలిపారు. లైన్‌లో ఉన్న ప్ర‌తి ఒక్క‌రికీ ఓటు వేసే అవ‌కాశం క‌ల్పించామ‌న్నారు.

ఇలా.. రాష్ట్ర వ్యాప్తంగా 88.9 శాతం మేర‌కు పోలింగ్ న‌మోదైంద‌ని.. ఇదే ఇప్ప‌టి వ‌ర‌కు ఉన్న రికార్డు అని అధికారులు వివ‌రించారు. గ‌త 2021లో జ‌రిగిన ఎన్నిక‌ల్లో 73.63 శాతం పోలింగ్‌ నమోదైందని తెలిపారు. ఇక‌, గెలుపు, ఓట‌ములపై ఏ పార్టీకి ఆ పార్టీ ధీమా వ్య‌క్తం చేసింది. భారీ స్థాయిలో పోలింగ్ న‌మోదు కావ‌డం స‌హ‌జంగా ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా భావిస్తారు. కానీ, ఈ ద‌ఫా అలా కాద‌ని.. కేంద్రం చేస్తున్న కుట్ర‌ల‌పై త‌మిళ ప్ర‌జ‌లు తిరుగుబాటు ప్ర‌ద‌ర్శించి.. ఓటు రూపంలో స‌మాధానం చెప్పార‌ని అధికార డీఎంకే పేర్కొంది.

బీజేపీ మాట ఇదీ..

భారీ స్థాయిలో పోలింగ్ న‌మోదు కావ‌డం.. త‌మ‌కు అనుకూలంగా ఉన్న విష‌యాన్ని స్ప‌ష్టం చేసింద‌ని బీజేపీ నాయ‌కులు వెల్ల‌డించారు. ముఖ్యంగా ప్ర‌ధాని మోడీ రాత్రి స్పందిస్తూ.. త‌మిళ ప్ర‌జ‌లు కేంద్రానికి అనుకూలంగా ఓటేశార‌ని చెప్పారు. మ‌హిళ‌ల‌కు వ్య‌తిరేకంగా ఉన్న పార్టీల‌కు(డీఎంకే, కాంగ్రెస్‌) బుద్ధి చెప్పార‌ని వ్యాఖ్యానించారు. ఇదిలావుంటే.. ఎన్నిక‌ల సంఘం ఎన్ని చ‌ర్య‌లు తీసుకున్నా.. చాలా నియోజ‌క‌వ‌ర్గాల్లో పోలింగ్ జ‌రుగుతున్న స‌మ‌యంలోనే ఓట‌ర్ల‌ను ప్ర‌భావితం చేసేలా న‌గ‌దు పంపిణీ య‌ధేచ్ఛ‌గా సాగిపోయింది. ఈ విష‌యంలో అన్ని పార్టీలు స‌మైక్య‌త‌ను ప్ర‌ద‌ర్శించాయి. ఎక్క‌డా ఎవ‌రూ ఫిర్యాదులు చేసుకోక‌పోవ‌డం గ‌మ‌నార్హం.

ప‌ల్నాడు ఘ‌ట‌న పున‌రావృతం..

ఏపీలో 2024లో జ‌రిగిన ఎన్నిక‌ల స‌మ‌యంలో ప‌ల్నాడులోని మాచ‌ర్ల నియోజ‌క‌వ‌ర్గం అప్ప‌టి ఎమ్మెల్యే పిన్నెల్లి రామ‌కృష్నారెడ్డి ఓ బూత్‌లోకి వెళ్లి.. ఈవీఎంను నేల‌కేసి కొట్టిన ఘ‌ట‌న గుర్తుండే ఉంటుంది. తాజాగా ఇలాంటి ఘ‌ట‌నే త‌మిళ‌నాడులోనూ జ‌రిగింది.

తిరువణ్ణామలై జిల్లాలోని కలసపాక్కం నియోజ‌క వ‌ర్గంలో ఇండిపెండెంట్ అభ్యర్థి ఏజెంట్లు అక్కడి ఈవీఎంలను ధ్వంసం చేశారు. డీఎంకే అభ్య‌ర్థి దొంగ ఓట్లు వేయిస్తున్నార‌ని.. ఆరోపించారు. అయితే, పోలీసులు వారిని అరెస్టు చేశారు. ఈ ద‌ఫా మ‌రో చిత్రం ఏంటంటే.. ప‌లు గ్రామాల ప్ర‌జ‌లు తమ స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించేందుకు ఏ పార్టీ కూడా ఉత్సాహం చూప‌లేద‌ని ఆరోపిస్తూ.. ఎన్నిక‌ల‌ను బ‌హిష్క‌రించాయి.