గతంలో టీడీపీ అధికార ప్రతినిధిగా పని చేసిన సాదినేని యామినీ శర్మ….2019 ఎన్నికల అనంతరం బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే. టీడీపీలో యాక్టివ్ రోల్ ప్లే చేసిన యామిని….ఆ తర్వాత టీడీపీపై విమర్శలు గుప్పించారు. టీడీపీ అధికార ప్రతినిధిగా గట్టి వాయిస్ వినిపించిన యామిని…టీడీపీలో అంతర్గత కలహాల వల్లే తాను పార్టీ వీడుతున్నట్లు చెప్పారు. తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో యాక్టివ్ పాలిటిక్స్ లో ఉండేందుకు యామిని బీజేపీలో చేరినట్లు ప్రచారం జరిగింది.
ఈ నేపథ్యంలోనే బీజేపీలో చేరిన యామినిని ఆ పార్టీ సముచితంగా గౌరవించింది. బీజేపీ మహిళా నాయకురాలు యామినికి అరుదైన గౌరవం దక్కింది. అమెరికాలోని భారతీయ యువ పారిశ్రామిక వేత్తల సంఘం(సిఐఎంఎస్ఎంఈ) గౌరవ అధ్యక్షురాలిగా యామిని ఎంపికయ్యారు. ఆ సంఘం వారు పంపిన లేఖను యామినీ తన ఫేస్ బుక్ ఖాతాలో షేర్ చేసి హర్షం వ్యక్తం చేశారు.
ప్రభుత్వ, ప్రైవేట్ రంగంలో (పెద్ద, మధ్యస్థ, చిన్న, ప్రారంభ, ప్రభుత్వ విభాగాలు, ఆర్థిక, విద్యా సంస్థలు, ఎన్జీఓలు) సంస్థలకు ప్రయోజనం చేకూర్చేలా ప్రత్యేక సలహా సేవలను సిఐఎంఎస్ఎంఈ సంస్థ అందిస్తుంది. దాంతోపాటు, భారత్‌లో పెట్టుబడులు పెట్టే విధంగా పారిశ్రామికవేత్తలను ఈ సంస్థ ప్రోత్సహిస్తుంది. సిఐఎంఎస్ఎంఈ గ్లోబల్ ప్రెసిడెంట్ గా ఎంపికవడం చాలా సంతోషంగా ఉందని యామినీ శర్మ తెలిపారు. తమ సిఐఎంఎస్ఎంఈ ద్వారా భారత్ లో భారీ పెట్టుబడులు పెట్టే విధంగా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహిస్తామని యామినీ చెప్పారు.
భారత్ లో కొత్తగా పరిశ్రమల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం ఎన్నో రాయితీలను ఇస్తోందని…కరోనా నేపథ్యంలో చైనా నుంచి పెట్టుబడులు ఉపసంహరించుకుంటున్న కంపెనీలను భారత్ లో పెట్టుబడులు పెట్టేలా ప్రోత్సహించాలని ప్రధాని మోడీ పిలుపునిచ్చారని యామిని చెప్పారు. ప్రధాని పిలుపు ప్రకారం…భారత్ లో పెట్టుబడులు పెట్టేలా దిగ్గజ పారిశ్రామిక వేత్తలను సంప్రదిస్తానని యామినీ చెప్పారు.