వంగవీటి జనసేనలో చేరుతున్నారా ?

వంగవీటి రాధాకృష్ణ జనసేనలో చేరుతున్నారా ? పార్టీ వర్గాల సమాచారం ప్రకారం అందరికీ ఇదే అనుమానం వస్తోంది. సోమవారం మచిలీపట్నం కలెక్టరేట్ కు జనసేన అధినేత పవన్ కల్యాణ్ వస్తున్నారు. నివర్ తుపాను బాధిత రైతులను ఆదుకోవాలనే డిమాండ్ తో పవన్ జిల్లా కలెక్టర్ ను కలుసుకోబోతున్నారు. కలెక్టర్ ను కలుసుకుని పవన్ ఏమి చేస్తారంటే కలుస్తారంతే. ఈ నేపధ్యంలో పవన్ ఏర్పాట్లను పార్టీ కీలక నేత నాదెండ్ల మనోహర్ చూస్తున్నారు. ఏర్పాట్లలో బిజీగా ఉన్న మనోహర్ ను వంగవీటి కలిశారు. దాంతో అందరిలోను వీళ్ళ భేటిపై ఆసక్తి రేపుతోంది.

ప్రస్తుతం రాధా తెలుగుదేశంపార్టీలో ఉన్నారు. అయితే ఆయనేమంత పెద్ద యాక్టివ్ గా లేరు. ఎప్పుడో ఓసారి చంద్రబాబునాయుడును కలిసి చర్చించటం లేకపోతే అమరావతి రైతుల దీక్షలో కనబడటం మాత్రమే చేస్తున్నారు. ఇంతకు మించి పార్టీ కార్యక్రమాల్లో ఎక్కడా కనబడటం లేదు. తొందరలోనే రాధా టీడీపీని వదిలేసి వచ్చేస్తారనే ప్రచారం అందరికీ తెలిసిందే. ఈ నేపధ్యంలోనే ఒకసారి పవన్ తోను తర్వాత రెండుసార్లు మనోహర్ తో కూడా భేటీ అయ్యారు.

ఇదే సమయంలో కొందరు బీజేపీ నేతలతో కూడా వంగవీటి భేటీ అయ్యారు. దాంతో జనసేన, బీజేపీల్లో దేనిలో ఒకదానిలో చేరిపోవటం ఖాయమని ప్రచారం ఊపందుకుంది. అయితే ప్రచారం ఎలా పెరిగిపోయిందో వెంటనే అదే విధంగా చల్లారిపోయింది. ఎందుకంటే రాధా ఎక్కడా మళ్ళీ కనబడలేదు. అలాంటిది ఇంతకాలానికి నాదెండ్లతో రాధా భేటీ అవ్వటంతో మళ్ళీ ప్రచారం మొదలైంది. సోమవారం మచిలీపట్నంకు వెళ్ళి పవన్ తో కూడా భేటీ అవనున్నట్లు సమాచారం.

అంటే వంగవీటి ఆలోచన ఇక్కడ రెండు రకాలుగా ఉందని అంటున్నారు. జనసేన, బీజేపీలు రెండు మిత్రపక్షాలే అయినందుకు తాను ఏ పార్టీలో చేరినా ఒకటే అన్న భావనలో ఉన్నారట. రెండింటిలో జనసేనలో చేరితో సామాజికవర్గపరంగా కూడా కలిసి వస్తుందని ఆలోచిస్తున్నారట. ఎందుకంటే జనసేనపై కాపుల పార్టీ అనే ముద్ర ఉంది కాబట్టి తనకు బాగా అడ్వాంటేజ్ అవుతుందని రాధా భావనగా చెబుతున్నారు. చూద్దాం తొందరలోనే ఏదో నిర్ణయం తీసుకోకుండా ఉంటారా ?