ప్రాణాంతక వ్యాధితో పోరాడుతున్న చిన్నారి పునర్వికకు కొత్త జీవితం లభించింది. మంత్రి నారా లోకేష్ ఇచ్చిన మాట నిలబెట్టుకుని, ఆమెకు అత్యంత ఖరీదైన ప్రాణరక్షక ఇంజెక్షన్ అందించి చికిత్సను విజయవంతంగా పూర్తి చేయించారు. వెన్నెముక కండరాల క్షీణత వ్యాధి అయిన స్పైనల్ మాస్క్యూలర్ ఆంట్రోఫీ తో బాధపడుతున్న పునర్వికకు రూ.16 కోట్ల విలువైన ‘జోల్జెన్స్‌మా’ ఇంజెక్షన్ ఇవ్వడంతో ప్రాణాపాయం తప్పింది.
చికిత్స కోసం ప్రజలు ముందుకు వచ్చి సుమారు రూ.10 కోట్లు సమకూర్చగా, మిగిలిన రూ.6 కోట్ల కోసం ఆందోళనలో ఉన్న తల్లిదండ్రులకు లోకేష్ అండగా నిలిచారు. అవసరమైన మొత్తాన్ని తానే ప్రభుత్వం తరుపున భరిస్తానని హామీ ఇచ్చి, విదేశాల నుంచి ఇంజెక్షన్ తెప్పించారు. హైదరాబాద్‌లోని రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్ లో వైద్యులు సకాలంలో చికిత్స అందించడంతో చిన్నారి ప్రాణాలు కాపాడబడ్డాయి.
పెరుగుదలను అడ్డుకుంటూ తీవ్ర ఇబ్బందులకు గురిచేసే ఈ అరుదైన వ్యాధి నుంచి విముక్తి పొందిన పునర్విక మృత్యుంజయురాలిగా నిలిచింది. ప్రజల సహకారం వృథా కాకుండా స్వయంగా పర్యవేక్షిస్తూ చికిత్స జరిగేలా లోకేష్ చర్యలు తీసుకోవడం విశేషంగా నిలిచింది.
“ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం నా బాధ్యత. పునర్విక కోసం చేసిన వాగ్దానం నెరవేరింది” అని లోకేష్ పేర్కొన్నారు. చిన్నారి నిండు నూరేళ్లు ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షించారు. చిన్నారి పునర్వికకు ఇది పునర్జన్మలాంటి క్షణంగా కుటుంబ సభ్యులు భావిస్తున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates