ప్రకాష్‌రాజ్‌పై రూ.100 కోట్ల పరువు నష్టం దావా?

సినీనటుడు ప్రకాష్ రాజ్‌పై టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాశ్ రెడ్డి పరువు నష్టం దావా దాఖలు చేయనున్నట్లు ప్రకటించారు. హిందువుల మనోభావాలను కించపరిచేలా ప్రకాష్‌రాజ్ వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ, వెంటనే బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన తరఫున అడ్వకేట్ ద్వారా లీగల్ నోటీసులు జారీ చేయగా, క్షమాపణలు చెప్పకపోతే రూ.100 కోట్ల పరువు నష్టం దావా వేస్తామని హెచ్చరించారు.

ఇటీవల కేరళలో జరిగిన సాహిత్య ఉత్సవంలో పాల్గొన్న ప్రకాష్‌రాజ్, దక్షిణ భారతదేశంపై హిందీ భాషా ప్రాబల్యం అంశాన్ని ప్రస్తావిస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా శ్రీరాముడు, లక్ష్మణుడులను ఉత్తర భారత వలస కూలీలతో పోల్చుతూ మాట్లాడడం తీవ్ర చర్చకు దారితీసింది. పని కోసం వచ్చే వారు పని చేసుకుని వెళ్లాలి కానీ, తమ భాషను ఇతరులపై రుద్దకూడదని ఆయన వ్యాఖ్యానించారు.

ఈ వ్యాఖ్యలపై హిందూ సంఘాలు, నెటిజన్లు తీవ్రంగా స్పందించాయి. భక్తుల విశ్వాసాలను దెబ్బతీసేలా వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ పలుచోట్ల నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ప్రకాష్‌రాజ్‌పై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని కూడా భానుప్రకాశ్ రెడ్డి డిమాండ్ చేశారు.

వివాదం మరింత ముదురుతున్న నేపథ్యంలో ప్రకాష్‌రాజ్ స్పందనపై ఆసక్తి నెలకొంది. క్షమాపణలు చెబుతారా, లేక న్యాయపరంగా పోరాటానికి దిగుతారా అన్నది రాజకీయ, సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.