ఐటీ ఉద్యోగులు తప్పనిసరిగా చదవాల్సిన నివేదిక

కరోనా వచ్చింది.. భారీగా దెబ్బేసిందన్న మాట చాలామంది నోటి నుంచి వింటుంటాం. మిగిలిన రంగాల సంగతి ఎలా ఉన్నా.. ఐటీ రంగానికి మాత్రం ఈ మాట వర్తించదని చెబుతున్నారు. అన్ని రంగాలు కరోనా కారణంగా ప్రభావితమయ్యయని.. ఐటీ రంగం మాత్రం ఇందుకు మినహాయింపుగా చెబుతున్నారు. ఐటీ రంగంలో ఉద్యోగాల గిరాకీ తగ్గలేదని.. తాజాగా విడుదలైన జాబ్ ఫ్లాట్ ఫామ్ స్కైకీ మార్కెట్ నెట్ వర్కు వెల్లడించింది.

కరోనా నేపథ్యంలో వ్యాపారాలు డిజిటల్ బాట పట్టటంతో.. టెక్నాలజీ వినియోగం అధికమైందని ఈ నివేదిక పేర్కొంది. దీంతో.. ఐటీ రంగంలో ఉద్యోగాలకు గిరాకీ పెరిగినట్లుగా తేల్చింది. ప్రపంచ వ్యాప్తంగా ఐటీ రంగంపై కరోనా ప్రభావం తక్కువేనని.. కంపెనీలు డిజిటల్ కు మారేందుకు ఐటీ కీలకభూమిక పోషించినట్లు చెబుతున్నారు. ఈ నివేదికలో పలు ఆసక్తికర అంశాలున్నాయి. ప్రాజెక్టు మేనేజర్ ఉద్యోగాలకు బెంగళూరులో అధిక గిరాకీ లభించింది. తర్వాతి స్థానాల్లో ఢిల్లీ.. ఫుణేలు నిలిచాయి.. ఐటీ రంగంలో ప్రాజెక్టు మేనేజర్లకు 55 శాతం గిరాకీ ఉంటే.. నిర్మాణ రంగంలో ఆరు శాతం.. రిక్రూట్ మెంట్ రంగంలో ఐదు శాతం.. బ్యాకింగ్ లో మూడు శాతం ఉన్నట్లుగా తేలింది.

డెవలపర్ల రంగంలోనూ గిరాకీ ఉన్నట్లు తేలింది. డెవలపర్లలో గిరాకీ 65 శాతం ఐటీ రంగానికి చెందిన వారేనని తేల్చారు. డెవలపర్లకు ఎక్కువ అవకాశాలు బెంగళూరులో ఉంటే.. తర్వాతి స్థానం ఢిల్లీ.. హైదరాబాద్.. ఫూణెలు నిలిచాయి. డిజిటల్ మార్కెటింగ్ ఉద్యోగాలకు బెంగళూరులో 28 శాతం గిరాకీ లభిస్తే.. తర్వాతి స్థానంలో ఢిల్లీ.. ముంబయి.. హైదరాబాద్ నిలిచాయి. ఐటీ ఉద్యోగులకు ఎక్కువగా జీతాలు ఇస్తున్న నగరాల్లో బెంగళూరు మొదటి స్థానంలో నిలిచింది. తర్వాతి స్థానం ఫూణెగా తేలింది. నవంబరులో వచ్చిన మొత్తం ఐటీ ఉద్యోగాల్లో 50 శాతం బెంగళూరు.. ఫుణె.. హైదరాబాద్.. ఢిల్లీ నగరాల్లోనే ఉండటం గమనార్హం.