కేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీ అగ్రనాయకుడు అమిత్ షా.. ఇచ్చిన మాట.. ఆరు మాసాలు కూడా తిరక్కుండానే వాస్తవంకానుంది. సహజంగా దేశం మొత్తానికి హోం మంత్రి అయిన షా అంతటి నేత మాటిస్తే.. అది నెరవేరకపోవడం.. ఏముంటుందన్న ప్రశ్న వస్తుంది. కానీ, ఆయన మాటిచ్చింది.. ఆషామాషీకాదు. అప్పటికే ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉండగా.. మరో నాయకుడిని అదే సీటులో కూర్చోబెడతానని!!.
అదే.. బీహార్. గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల సమయంలో అమిత్ షా బహిరంగ వేదికపై బీజేపీకి చెందిన కీలక యువ నాయకుడికి మాట ఇచ్చారు. “ఇప్పుడు మాట ఇస్తున్నా.. త్వరలోనే సమ్రాట్ అతి `పెద్ద పదవి`ని చేపట్టడం ఖాయం“ అని షా వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో అతి పెద్ద పదవి ఏముంది? అంటే.. అది సీఎం పదవే!. అయితే.. వాస్తవానికి అప్పటికే బీహార్ తదుపరి ముఖ్యమంత్రిగా సిట్టింగ్ సీఎం నితీష్ కుమార్‌ను ప్రకటించారు.
ఇదే విషయంపై మీడియా తర్వాత కొద్దిసేపటికే.. షాను ప్రశ్నించింది. “తదుపరి ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్‌ను ప్రధాన మంత్రి ప్రకటించరు. మీరు ఇప్పుడు సమ్రాట్ చౌదరిని ప్రకటిస్తున్నారు. ఇది ఎలా సాధ్యం?“ అని ప్రశ్నించింది. దీనికి షా.. చిరునవ్వులు చిందిస్తూ.. “ఏదైనా జరగొచ్చు. మీరే చూస్తారు. ముందు విజయం దక్కించుకుంటాం.. అది చూడండి.“ అని సమాధానం ఇచ్చారు. ఇక, ఆ తర్వాత.. రాష్ట్రంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్ డీయే సర్కారు కొలువుదీరింది. నితీష్ ముఖ్యమంత్రి అయ్యారు.
అమిత్ షా చేసిన కామెంట్లను అందరూ మరిచిపోయారు. కానీ, కట్ చేస్తే.. ఆరు మాసాలు కూడా తిరక్కుండానే అమిత్‌షా చెప్పింది నిజమైంది. బీహార్ ముఖ్యమంత్రిగా ఉన్న నితీష్ రాజ్యసభకు ప్రమోట్ అయ్యారు. తన సీఎం పదవికి రాజీనామా చేశారు. మంగళవారం తన మంత్రివర్గాన్ని కూడా రద్దు చేసుకున్నారు. ఇక, తదుపరి ముఖ్యమంత్రిగా సమ్రాట్ చౌధరి పేరును పార్టీ అధిష్టానం దాదాపు ఖరారు చేసింది. ఫలితంగా.. షా ఇచ్చిన మాట.. ఆరు మాసాల్లోనే నిజమైందంటూ.. బీజేపీ నాయకులు పోస్టులు పెడుతున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates
