టీఆర్ఎస్ బ్రాండ్ కోసం గులాబీ వార‌సుల వార్‌…?

తెలంగాణ రాజకీయాల్లో ఒకప్పుడు తిరుగులేని శక్తిగా వెలిగిన గులాబీ గూటిలో ఇప్పుడు ఆసక్తికరమైన ఆధిపత్య పోరు మొదలైంది. కేసీఆర్ రాజకీయ వారసత్వం కోసం, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర సమితి అనే బ్రాండ్ నేమ్ కోసం కేటీఆర్, కవితల మధ్య పోటీ తీవ్రతరమవుతోంది. పార్టీని బీఆర్ఎస్‌గా మార్చడం వల్లే తెలంగాణ అస్తిత్వాన్ని కోల్పోయామని, గ్రాఫ్ పడిపోయిందని పార్టీ శ్రేణుల్లో ఉన్న నమ్మకాన్ని కేటీఆర్ బలపరిచారు. మనం మళ్లీ టీఆర్ఎస్ కావాలి అని ఆయన తాజాగా చేసిన వ్యాఖ్యలు చూస్తుంటే బీఆర్ఎస్‌ను టీఆర్ఎస్‌గా మార్చేందుకు సిద్ధ‌మైపోయిన‌ట్టు క‌నిపిస్తోంది.

టీఆర్ఎస్ పేరు ఇప్పుడు ఖాళీగా ఉంది అంటూ కవిత చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. అన్న కంటే ముందే ఆ పేరును దక్కించుకుని, మహిళా సెంటిమెంట్‌తో తన రాజకీయ భవిష్యత్తును పునర్నిర్మించుకోవాలన్న‌ది క‌విత ప్లాన్‌గా తెలుస్తోంది. ఇదిలా ఉంటే అన్నాచెల్లి ఇద్దరు కూడా పోటాపోటీగా పాదయాత్రలకు సిద్ధమవ్వడం మరో కీలక పరిణామం. కేటీఆర్ పార్టీ కేడర్‌ను ఉత్తేజితం చేయాలని చూస్తుంటే, కవిత ప్రజల్లో ఉంటూ తన ఇమేజ్‌ను ప్రక్షాళన చేసుకోవాలని ఆశిస్తున్నారు.

ఒకే కుటుంబం నుంచి ఇద్దరు నేతలు ఒకే బ్రాండ్ కోసం, ఒకే తరహా కార్యాచరణతో ముందుకు రావడం పార్టీ ఓటు బ్యాంకులో చీలిక తెస్తుందా ? లేదా ఎవ‌రు టీఆర్ఎస్ బ్రాండ్ ఇమేజ్ ద‌క్కించుకుని పైచేయి సాధిస్తారు అన్న‌ది తెలంగాణ రాజ‌కీయ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ‌గా మారింది. తెలంగాణ ప్రజల గుండెల్లో బలంగా నాటుకుపోయిన టీఆర్ఎస్ అనే పేరు ఇప్పుడు ఒక రాజకీయ ఆస్తిగా మారింది. ఈ ఆస్తిని దక్కించుకున్న వారే కేసీఆర్ అసలైన వారసుడిగా ముద్ర వేయించుకుంటారన‌డంలో ఎలాంటి డౌట్లు లేవు.

జాతీయ రాజకీయాల మోజులో తెలంగాణను దూరం చేసుకున్నామని ఇప్పుడు బీఆర్ఎస్ అగ్ర నాయ‌క‌త్వం బాధ‌ప‌డుతోంది. అందుకే కేటీఆర్‌ తన నాయకత్వంలోనే టీఆర్ఎస్ పునర్వైభవం రావాలని ఆయన వ్యూహరచన చేస్తున్నారు. టీఆర్ఎస్ బ్రాండ్‌ను ఒక ఆయుధంగా మలచుకోవాలని కవిత చూస్తున్నారు. పాత పేరుతో, కొత్త అజెండాతో ప్రజల్లోకి వెళ్లి తెలంగాణ సెంటిమెంట్‌ను తిరిగి తనవైపు తిప్పుకోవాలని ఆమె కృతనిశ్చయంతో ఉన్నారు. మ‌రి ఈ పోరులో ఎవ‌రిది పైచేయి అవుతుందో ?  చూడాలి.