తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న `హైడ్రా` వ్యవస్థపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండానే కూల్చివేతలు చేపట్టడం ఏంటని నిలదీసింది.“మీరేమైనా ప్రజలపై యుద్ధం చేస్తున్నారా? మీరు చేపడుతున్న కూల్చివేతలను గమనిస్తే..యుద్ధ సన్నివేశాలను తలపిస్తున్నాయి. ఇలాంటి చర్యలు చేపట్టే అధికారం మీకు ఉందా? ఉంటే ఎవరు అధికారం ఇచ్చారు“ అని నిలదీసింది. ఎలాంటి నిబంధనలు పాటించకుండా.. ముందస్తు నోటీసులు కూడా ఇవ్వకుండానే కూల్చివేతలు ఎలా చేపడతారని ప్రశ్నించింది.
ఇటీవల అమీన్‌పూర్ మండలం ఐలాపురంలో భారీ అంతస్థుల భవనాన్ని ఆక్రమించారంటూ.. హైడ్రా దానిని కూల్చివేసింది. ఈ సందర్భంగా బాధితులు గగ్గోలు పెట్టినా హైడ్రా అధికారులు వినిపించుకోలేదన్న చర్చ తెరమీదికి వచ్చింది. తాజాగా వీరు హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన హైకోర్టు.. హైడ్రాకు ఉన్న అధికారాలను ప్రశ్నించింది. ఏ అథారిటీతో కూల్చివేతలు చేపడుతున్నారని ప్రశ్నల వర్షం కురిపించింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు ఎక్కడా ఎలాంటి నిర్మాణాలను కూల్చివేయడానికి వీల్లేదని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
ముఖ్యంగా కూల్చివేతలు అంటే.. భారీ భవనాలను అడ్డగోలుగా కూల్చివేయడం కాదని పేర్కొంది. “అక్రమ కట్టడాల వల్ల పర్యావరణం దెబ్బతింటోందని భావించినా.. ప్రభుత్వ స్థలాలను ఆక్రమించుకున్నారని తెలిసినా.. కాల్వలు, చెరువులను ఆక్రమించుకున్నా వాటిని తొలగించేందుకు మాత్రమే అనుమతి ఉంటుంది.“ అని స్పష్టం చేసింది.
అయినప్పటికీ నిబంధనలను పాటించాల్సిందేనని తేల్చి చెప్పింది. సరైన ప్రామాణికతలు పాటించకుండా కూల్చివేతలు చేపట్టవద్దని గతంలోనే ఆదేశాలు ఇచ్చిన విషయాన్ని హైకోర్టు మరోసారి గుర్తు చేసింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు కూల్చివేతలు చేపట్టరాదని స్పష్టం చేసింది.
Gulte Telugu Telugu Political and Movie News Updates
