విజయ్ కు పవన్ సలహా ఇస్తారా?

“నేనెవ‌రికీ స‌ల‌హాలు ఇవ్వ‌ను.“ అని జ‌న‌సేన అధినేత‌, ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ చెప్పారు. ఎవ‌రి నుంచైనా తానే స‌ల‌హాలు తీసుకుంటాన‌ని.. వాటిలో మంచి చెడుల‌ను ఆలోచించి అమ‌లు చేసేందుకు ప్ర‌య‌త్నిస్తాన‌ని తెలిపారు. ఇత‌రుల‌కు ఇచ్చే స‌ల‌హాల‌పై ఎప్పుడూ దృష్టి పెట్ట‌లేద‌న్నారు. త‌న‌కంటే కూడా అంద‌రూ బాగానే ఆలోచిస్తార‌ని విశ్వ‌సిస్తాన‌న్నారు. ఒక‌వేళ ఇత‌రుల‌కు స‌ల‌హాలు ఇచ్చినా.. అవి న‌చ్చుతాయో లేదో అనే భావ‌న త‌న‌లో ఉంటుంద‌ని.. కాబ‌ట్టి ఎవ‌రికీ  స‌ల‌హాలు ఇవ్వ‌క‌పోవ‌డ‌మే మంచి ద‌న్న ధోర‌ణిలో ఉంటాన‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు.

తాజాగా జ‌న‌సేన పార్టీ కార్యాల‌యంలో `జ‌న‌సేనాని విత్ జ‌న్‌జీ` కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు. దీనికి పెద్ద ఎత్తున యువ‌త వ‌చ్చారు. వారితో ప‌రిచ‌యం ఏర్ప‌రుచుకున్న ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. వారు అడిగిన ప‌లు ప్ర‌శ్న‌ల‌కు ఆయ‌న స‌మాధానం చెప్పారు. వీటిలో రాజ‌కీయం నుంచి వ్య‌క్తిగ‌త అంశాల వ‌ర‌కు, ప‌ర్యావ‌ర‌ణం నుంచి స‌మాజం  వ‌ర‌కు అనేకం ఉన్నాయి. ఒక్కొక్క దానికీ ఆయ‌న చాలా ఓర్పుగా.. నేర్పుగా స‌మాధానం ఇచ్చారు. ఎవ‌రినీ నొప్పించ‌కుండా.. తాను ఇరుకున ప‌డ‌కుండా ఈ కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించ‌డం విశేషం.

విజ‌య్ గురించి..

త‌మిళ‌నాడులో టీవీకే పేరుతో కొత్త‌గా రాజ‌కీయ పార్టీపెట్టుకుని.. ప్ర‌స్తుతం జ‌రుగుతున్న అసెంబ్లీ ఎన్నిక‌ల్లో పోటీ చేస్తున్న విజ‌య్ అంశాన్ని ప‌లువురు యువ‌త ప్ర‌స్తావించారు. ఆయ‌న తొలిసారి ఎన్నిక‌ల బ‌రిలో నిలిచార‌ని.. ఆయ‌న‌కు ఏమైనా స‌ల‌హాలు ఇస్తున్నారా? అన్న ప్ర‌శ్న‌కు స్పందిస్తూ.. తాను ఎవ‌రికీ స‌ల‌హాలు ఇవ్వ‌బోన‌న్నారు. విజ‌య్ చాలా సీనియ‌ర్ న‌టుడ‌ని.. స‌మాజంపైనా ముఖ్యంగా త‌మిళ‌నాడు స‌మ‌స్య‌లు, అక్క‌డి ప్ర‌జ‌లపైనా ఆయ‌న‌కు అవ‌గాన ఉన్నాయ‌ని తెలిపారు. ప్ర‌స్తుత ఎన్నిక‌ల్లో ఆయ‌న ఎంతో కృషి చేస్తున్నార‌ని తెలిపారు.

ప‌నితీరు..

ప‌నితీరుతో ప్ర‌తిఫ‌లాన్ని ఆశించే విష‌యంపై స్పందిస్తూ.. తాను ప‌ని మాత్ర‌మే చేస్తాన‌ని.. ఫ‌లితాన్ని ఆశించ‌బోన‌న్నారు. గ‌త ఎన్నికల్లోనూ ఎంతో క‌ష్ట‌ప‌డ్డామ‌ని.. ఫ‌లితం ఆశించ‌లేద‌న్నారు. 2019 ఎన్నిక‌ల్లోనూ తాను రాష్ట్ర వ్యాప్తంగా ప‌ర్య‌టించాన‌న్నారు. కానీ, ఫ‌లితం ఒక్కొక్క సారి ఒక్కొక్క విధంగా ఉంటుంద‌న్నారు. ముందుగానే ఫ‌లితాన్ని ఆశించి.. ప‌నిచేస్తే.. జీవితం నిర్వేదంగా మారుతుంద‌న్నారు. త‌ర్వాత‌.. చేసే ప‌నిపై నిమ‌గ్నం కాలేమ‌న్నారు. ఫ‌లితాన్ని ఆశించకుండా ప‌నిచేస్తే.. ఏ ఇబ్బందీ ఉండ‌ద‌ని తెలిపారు.

ప్ర‌కృతిని ప్రేమిస్తా..

తాను ప్ర‌కృతిని ప్రేమిస్తాన‌ని ఒక వ్య‌క్తి అడిగిన ప్ర‌శ్న‌కు స‌మాధానం ఇచ్చిన ప‌వ‌న్‌.. ప్ర‌కృతి ఆరాధ‌న అనేది అనాదిగా వ‌స్తున్న ఆచార‌మ‌న్నారు. తాను కంటెంట్ క్రియేట‌ర్ అయితే.. ఇదే ప‌నిచేస్తాన‌న్నారు. ప్ర‌కృతికి సంబంధించిన అనేక వీడియోలు చేస్తాన‌న్నారు. దేశ భ‌క్తి కూడా యువ‌త‌కు ప్ర‌ధాన‌మ‌న్నారు. ఏదో ఆగ‌స్టు 15న‌, జ‌న‌వ‌రి 26న కేవ‌లం జెండాలు ఎగ‌రేయ‌డానికే ప‌రిమితం కావొద్ద‌న్నారు. దేశ భ‌క్తి అంటే.. దేశ ప్ర‌జ‌ల‌కు సేవ చేయ‌డ‌మేన‌న్నారు. దీనిని నిరంత‌రం కొన‌సాగించాల‌ని సూచించారు.

పాలిటిక్స్‌-త్యాగం..

యువ‌త అయినా.. మ‌రెవ‌రైనా రాజ‌కీయాల్లోకి రావాలంటే..సేవ‌ను ప‌ర‌మార్థంగా భావించాల‌ని ప‌వ‌న్ చెప్పారు. కేవ‌లం త్యాగాలు చేసినంత మాత్రాన ఏమీ జ‌ర‌గ‌ద‌న్నారు. త్యాగాల‌తో చేసే రాజ‌కీయం వెనుక స్వార్థం వ‌స్తుంద‌న్నారు. అంతేకాదు.. రాజ‌కీయాల‌ను వ్యాపార దృష్టితోనూ చూడ‌కూడ‌ద‌ని స్ప‌ష్టం చేశారు. ప్ర‌జ‌ల‌తో చేసేది వ్యాపారం కాద‌ని.. సేవ మాత్ర‌మేన‌ని తేల్చి చెప్పారు.  సోష‌ల్ మీడియాకు ప్ర‌స్తుతం మంచి రోజులు ఉన్నాయ‌ని.. దీనిని స‌రిగా వినియోగించుకుంటే ప్ర‌జ‌ల‌కు సేవ చేసేందుకు స‌రైన మార్గ‌మ‌ని దిశానిర్దేశం చేశారు.