ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలు, పదవీ విరమణ పొందిన ఉద్యోగులకు పెన్షన్లు చెల్లించేందుకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు కేంద్ర ప్రభుత్వం కూడా పెద్ద ఎత్తున నిధులను వెచ్చించాల్సిన పరిస్థితి. తప్పనిసరి కోటాకు చెందిన ఈ నిధులను కూడా పలు రాష్ట్ర ప్రభుత్వాలు దారి మళ్లిస్తూ ఉంటాయి.
అప్పుడు వేతనాల చెల్లింపు ఎలాగోలా చేసినా… పెన్షన్ల చెల్లింపులను మాత్రం వాయిదా వేస్తూ… ఎప్పుడో నిధులు అందుబాటులోకి వచ్చినప్పుడు చెల్లిస్తూ ఉంటాయి. మళ్లించిన నిధులను ఉచిత పథకాల అమలుకు వినియోగిస్తూ ఉంటాయి. ఈ తరహా పరిస్థితిపై బొంబాయి హైకోర్టు తప్పుబట్టింది. పెన్షన్లకు నిధులు లేకపోతే… ఉచిత పథకాలను ఎలా అమలు చేస్తారు? అంటూ మహారాష్ట్రలోని మహాయుతి సర్కారును కోర్టు నిలదీసింది.
బృహత్ ముంబాయి నగర పాలక సంస్థలో ఉపాధ్యాయురాలిగా పనిచేసి ఇటీవలే పదవీ విరమణ పొందిన ఓ ఉపాధ్యాయినీ.. తనకు సర్కారు నుంచి పెన్షన్ గానీ, ఇతరత్రా పదవీ విరమణ ప్రయోజనాలు గానీ అందలేదని హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ పై శుక్రవారం విచారణ జరగగా… ప్రభుత్వాన్ని హైకోర్టు మందలించినంత పనిచేసింది. ఉద్యోగులకు పెన్షన్లు చెల్లించేందుకు నిధులు లేకపోతే… మహిలకు నెలకు ఇస్తున్న రూ.1,500 పథకాన్ని నిలిపివేయాలని ఆగ్రహం వ్యక్తం చేసింది.
గడచిన అసెంబ్లీ ఎన్నికల్లో మహాయుతి కూటమి తాము గెలిస్తే… రాష్ట్రంలోని మహిళలకు ప్రతి నెలా ఆర్థిక సాయం కింద రూ.1,500 అందజేస్తామని హామీ ఇచ్చింది. ఈ పథకానికి ముఖ్యమంత్రి మజీ లడ్కీ బహెన్ యోజన అనే పేరు పెట్టింది. అనుకున్నట్లుగానే మహాయుతి కూటమి ఎన్నికల్లో విజయం సాధించగా… ఈ పథకం అమలు ప్రారంభమైంది.
ఈ పథకం కింద ప్రస్తుతం మహారాష్ట్రలోని దాదాపు 5 కోట్ల మంది మహిళలకు లబ్ధి చేకూరుతోంది. ఈ పథకం అమలు కోసం పలు శాఖలకు చెందిన నిధులను మహారాష్ట్ర సర్కారు దారి మళ్లిస్తోందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అదే సమయంలో పెన్షన్ రావట్లేదన్న రిటైర్డ్ టీచర్ పిటిషన్ విచారణకు రావడంతో హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది.
Gulte Telugu Telugu Political and Movie News Updates