తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ దత్త కుమార్తె పెళ్లి కూతురైంది. ఆ మధ్యన నిశ్చితార్థమైన ఆమె వివాహం రేపు (సోమవారం) జరగనుంది. సవతితల్లి చేతుల్లో హింసలకు గురై.. నరకం చూడటం.. ఇరుగుపొరుగువారి ఫిర్యాదుతో ఆమె గురించి లోకానికి తెలిసిందే. ఆమె పడిన అవస్థల గురించి తెలిసిన సీఎం కేసీఆర్ కదిలిపోవటమే కాదు.. ఆమెను తన దత్త పుత్రికగా స్వీకరించారు. ప్రగతిభవన్ కు పిలిపించి.. ఆదరించారు.
అప్పటి నుంచి ఆమె యోగక్షేమాలన్ని చూసుకునేందుకు సాంఘిక సంక్షేమశాఖకు చెందిన అధికారులకు అప్పజెప్పారు. అప్పటినుంచి వారి పర్యవేక్షణలో ఉన్న ఆమె.. ఇటీవల పెళ్లి కుదరటం తెలిసిందే. ఈ విషయాన్ని సీఎం కేసీఆర్ కు తెలియజేయటం.. నిఘా వర్గాల నుంచి వచ్చిన నివేదిక ఆధారంగా ప్రత్యూష పెళ్లికి ఓకే చెప్పారు. ఈ నేపథ్యంలో ఎంగేజ్ మెంట్ కొన్ని నెలల క్రితం జరిగింది.
పెళ్లికి రెండు రోజులు ముందు జరిగే సంప్రదాయాల్ని తాజాగా నిర్వహించారు. ఇందుకు బేగంపేటలోని ఐఏఎస్ గెస్ట్ హౌస్ వేదికైంది. మంగళవాయిద్యాల మధ్య పసుపు దంచటం.. ఒడి నింపటం.. పెళ్లి కుమార్తెను చేయటం లాంటి కార్యక్రమాల్ని సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. అయితే.. ఇవన్నీ కూడా సాంఘిక సంక్షేమ శాఖకు చెందిన అధికారిణిలేనిర్వహించటం విశేషం. సోమవారం హైదరాబాద్ కు చెందిన చరణ్ రెడ్డితో పెళ్లి జరగనుంది.