ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబుపై వైసీపీ అధినేత జగన్ పాత పాటే పాడారు. చంద్రబాబుకు చుక్కలు చూపిస్తానని వ్యాఖ్యానించారు. తాను వచ్చే ఏడాది పాదయాత్ర ప్రారంభిస్తానని.. అప్పుడు ప్రతిరోజూ ఆయనకు చుక్కలు కనిపించేలా చేస్తానని చెప్పారు. ఈ విషయంలో వైసీపీ శ్రేణులు నిరాశచెందాల్సిన పనిలేదన్నారు. తాజాగా బుధవారం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని తాడేపల్లిగూడెం నియోజకవర్గానికి చెందిన వైసీపీ నాయకులతో ఆయన భేటీ అయ్యారు. పార్టీ పరంగా ఎలా ముందుకు సాగాలన్న విషయంపై వారితో చర్చించారు.
ఈ సందర్భంగా చంద్రబాబుపై జగన్ విమర్శలు గుప్పించారు. ఎప్పుడో ఎక్కడో ఎవరో సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారని.. వారిపై ఇప్పటికీ కేసులు పెట్టి కొడుతున్నారని.. జైళ్లకు కూడా తరలిస్తున్నారని పేర్కొన్నారు. తాను అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అలానే జరుగుతుందన్నారు. రాష్ట్రంలో అవినీతి, అక్రమాలకు అంతులేకుండా పోయిందన్నారు. మహిళలను కించపరుస్తున్నా.. వారిపై అఘాయిత్యాలు జరుగుతున్నా.. చంద్రబాబుకు కనిపించడం లేదన్నారు. టీడీపీకి చెందిన ఎమ్మెల్యేలే మహిళలను వేధిస్తున్నారని విమర్శించారు.
కళ్లుమూసి తెరిచేలోగానే రెండున్నరేళ్లు గడిచిపోయాయని.. చెప్పిన జగన్, మరో రెండున్నరేళ్లు మరింత సునాయాసంగా గడిచిపోతాయన్నారు. తాను వచ్చే ఏడాది పాదయాత్రకు సిద్ధమవుతున్నానని.. ఏడాదిన్నరపాటు ప్రజల మధ్యే ఉంటానని పేర్కొన్నారు. అప్పుడు నిరంతరం.. చంద్రబాబుకు చుక్కలు చూపిస్తానని చెప్పారు. ప్రజల సమస్యలపై గళం వినిపిస్తానన్నారు. పార్టీపరంగా యుద్ధం చేసేందుకు కేడర్ సిద్షధంగా ఉండాలని సూచించారు. ఇప్పటికే పోరాటాలుచేస్తున్నామని.. కానీ.. ఇది మరింత పెరగాల్సిన అవసరం ఉందన్నారు.
మావిగన్ అనేది రెండో ఆప్షన్ అని జగన్ సమర్థించుకున్నారు. మూడు రాజధానులను అభివృద్ధి చేయడం ద్వారా రాష్ట్రంలో అన్ని ప్రాంతాల ప్రజలకు ప్రాధాన్యం ఇవ్వాలని భావించామన్నారు. అయితే.. ఇది సాధ్యంకాకపోతే.. ఆప్షన్-2 కింద మచిలీపట్నం, విజయవాడ, గుంటూరులను అభివృద్ది చేసుకునేందుకు ఎక్కువగా అవకాశం ఉందన్నారు. దీనిని కూడా చంద్రబాబు.. `జగన్` కోణంలో చూస్తున్నాడని.. అమరావతిని కాదంటే.. తనకు కమీషన్లు దక్కకుండా పోతాయని ఆలోచన చేస్తున్నారని విమర్శించారు. అమరావతి మరో పాతికేళ్లకు కూడా రెడీ కాదన్నారు. అన్ని లక్షల కోట్లు ఎవరు ఇస్తారని ప్రశ్నించారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates