మాన్సాస్ ట్రస్టుకు ఛైర్ పర్సన్ అయినప్పటి నుండి సంచైతా గజపతిరాజు ఏదో ఓ వివాదంలో నానుతునే ఉన్నారు. తాజగా సింహాచలం ఆలయంలో ఉత్తరద్వార దర్శనం విషయంలో కూడా మరో వివాదం రేగుతోంది. వైకుంఠ ఏకాదశినాడు ఉత్తరద్వార దర్శనాన్ని ముందుగా తాను చేసుకున్న తర్వాత మాత్రమే మిగిలిన వాళ్ళను అనుమతించాలని సంచైత ఆదేశించారట. అందుకనే ఆమె దర్శనం అయ్యేంతవరకు ఇతరులెవరినీ ఆలయ అధికారులు దర్శనానికి అనుమతించలేదు.
ఇతరుల సంగతిని పక్కన పెట్టేస్తే మాన్సాస్ ట్రస్టుబోర్డు సభ్యులు, గజపతుల కుటుంబసభ్యులను కూడా అధికారులు దర్శనానికి అనుమతించలేదట. తొలి దర్శనాన్ని సంచైత చేసుకుని వెళిపోయిన తర్వాతే ట్రస్టుబోర్డు సభ్యులు, గజపతుల కుటుంబసభ్యులు దర్శనానికి రావటం పెద్ద వివాదంగా మారింది. ఉత్తరద్వార దర్శనానికి తాను వచ్చే సమయంలో ఇతరులెవరు ఆలయంలో ఉండకూడదని ఛైర్ పర్సన్ ఆదేశాలిచ్చినట్లు ప్రచారం జరుగుతోంది.
ఆలయంలోకి దర్శనం నిమ్మితం తాను వచ్చినపుడు ఇంకెవరైనా కనిపిస్తే వారిని సస్పెండ్ చేస్తానని సంచైత హెచ్చరించారని అందుకనే ఆలయ అధికారులు ఎవరిని కూడా లోపలకు అనుమతించలేదని ఆరోపణలు వినబడుతున్నాయి. సంచైత తండ్రి ఆనందగజపతిరాజు రెండోభార్య సుధా గజపతిరాజు దర్శనానికి వచ్చినపుడు మీడియా ఆమెతో మాట్లాడారు. అప్పుడు పై విషయాలన్నీ బయటపడ్డాయి. సంచైత ఆదేశాల ప్రకారమే ఆలయ అధికారులు తమెవరిని దర్శనానికి అనుమతించలేదని సుధ చెప్పారు.
తమ వల్ల ఆలయ సిబ్బందికి ఇబ్బదులు వస్తాయన్న కారణంగానే తాము కూడా సంచైత దర్శనం చేసుకని వెళ్ళిపోయేవరకు ఆలయానికి రాలేదని చెప్పారు. గతంలో సిరిమాను పైడితల్లి అమ్మవారి ఊరేగింపు సందర్భంగా గజపతుల కోట మీదకు ఊరేగింపును చూసేందుకు వచ్చిన సుధాతో పాటు ఆమె కూతురును అవమానించిందనే ఆరోపణలు తెలిసిందే. అంటే మరి ఆమెపై పద్దతి ప్రకారం దుష్ప్రచారం జరుగుతోందా ? లేకపోతే ఆమె వ్యవహారశైలి అలాగే ఉందా అన్నది తేలటం లేదు. మొత్తంమీద సంచైత అంటేనే మెజారిటి మీడియా బాగా వ్యతిరేక ప్రచారం చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే.
Gulte Telugu Telugu Political and Movie News Updates