ఏపీలో కీలక ఘట్టానికి కూటమి ప్రభుత్వం తెరదీయనుంది. `గూగుల్ డేటా` కేంద్రానికి కొబ్బరికాయ కొట్టేందుకు సిద్ధమైంది. గత ఏడాది ఈ వ్యవహారంపై పెద్ద ఎత్తున చర్చ జరగడం.. ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఒప్పందం కూడా చేసుకున్న విషయం తెలిసిందే. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సైతం.. ఈ ఒప్పందాన్ని పలు సందర్భాల్లో కొనియాడారు. ఏపీలోని ఐటీ రాజధానిగా భాసిల్లుతున్న విశాఖకు గూగుల్ డేటా కేంద్రం రానుంది. దీనికి సంబంధించి భూముల కేటాయింపు… వనరుల కేటాయింపు వంటివి కూడా పూర్తయ్యాయి.
గత ఏడాది జరిగిన ఒప్పందం మేరకు..విశాఖలో 600 ఎకరాలకు పైగా భూమిని రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. దీనికి కేంద్ర జీఎస్టీ నుంచి మినహాయింపు ఇచ్చింది. అదేసమయంలోవిద్యుత్ సుంకాలను రాష్ట్ర ప్రభుత్వం రాయితీగా ఇచ్చింది. అలాగే.. నీటిని ఉచితంగా ఇవ్వనున్నారు. భూమి సిస్తు, పన్నులను కూడా 5 సంవత్సరాల పాటు మినహాయించారు.. ఇలా.. అనేక రాయితీలపై ఒప్పందం కుదిరింది. కాగా.. డేటా కేంద్రాన్నిఏపీకి తెచ్చేందుకు.. మంత్రి నారా లోకేష్.. 2024లో అమెరికాకు వెళ్లి వారం రోజులు అక్కడే ఉండి ప్రయత్నాలను ముమ్మరం చేశారు.
ఈ కృషి ఫలితంగానే ఏపీకి డేటా కేంద్రం వచ్చింది. అయితే.. వాస్తవానికి ఇతర రాష్ట్రాలైన ఒడిశా(తీర ప్రాంత రాష్ట్రం) కూడా పట్టుబట్టినట్టు అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే.. చంద్రబాబు కోరిక మేరకు కేంద్రం విశాఖకు దీనిని కేటాయించింది. కాగా.. ఈ కేంద్రం నిర్మాణానికి సంబంధించిన అన్ని అనుమతులు, భూమి బదిలీ వంటివి ఒకింత ఆలస్యం కావడంతో(రైతులను ఒప్పించడంలోనే ఆలస్యమైంది.) కొంత మేరకు లేటైంది. తాజాగా దీనికి సంబంధించి ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. దీని ప్రకారం.. ఈ నెల 28న డేటా కేంద్రం ఏర్పాటుకు భూమి పూజ చేయనున్నారు.
తొలిదశలో 200 ఎకరాల్లో నిర్మాణ పనులు చేపడతారు. దీనికే ఈ నెలలో భూమి పూజ చేస్తారు. అనంతరం.. రెండో దశలో 200 ఎకరాల్లోనూ చివరి దశలో మరో 200 ఎకరాల్లోనూ నిర్మాణాలు ప్రారంభమవుతాయి. కాగా.. మొత్తం 15 బిలియన్ డాలర్లను పెట్టుబడిగా గూగుల్ పెట్టనుంది. అనేక మందికి ఉపాధి, ఉద్యోగాలు లభిస్తాయన్న అంచనా ఉంది. కాగా.. ఈ గూగుల్ డేటా కేంద్రం ఏర్పాటులో అదానీ, రైడెన్ ఇన్ఫోటెక్ సంస్థలు భాగస్వాములుగా ఉన్నాయి.
Gulte Telugu Telugu Political and Movie News Updates