జగన్‌ను రెడ్లు కూడా సమర్థించడం లేదా?

పార్టీలకు నాయకులు, నాయకులకు సామాజిక వర్గాలు మద్దతు అనేది అనాదిగా ఉన్న సంప్రదాయం. ఏ పార్టీకి ఆ పార్టీ సామాజిక వర్గాల వారీగానే రాజకీయాలు చేస్తున్న రోజులు ప్రబలుతున్నాయి. ఈ క్రమంలో ఎవరు అవునన్నా, కాదన్నా సామాజిక వర్గాల ఆధారంగానే రాజకీయాలు సాగుతున్నాయి. వైసీపీకి రెడ్ల మద్దతు అవసరం అనేది ఆ పార్టీ నాయకులు చెబుతున్న మాట. 2019లో దీనిని సాధించారు.

కానీ, 2019–24 మధ్య రెడ్డి సామాజిక వర్గానికి సరైన విధంగా సహకారం అందించని నేపథ్యంలో ఆ వర్గం వైసీపీకి, ముఖ్యంగా జగన్‌కు కూడా దూరమైంది. ఇక, 2024 ఎన్నికల్లో జగన్ ఓటమికి పనిచేసిన రెడ్డి నాయకులు కూడా ఉన్నారు. ఇక, వచ్చే ఎన్నికల నాటికి పరిస్థితి ఏంటి అనేది ఆసక్తిగా మారింది. జగన్ విషయంలో రెడ్డి నాయకులు ఎలా ఆలోచిస్తున్నారన్నది కూడా ముఖ్యమే. అయితే, ఈ విషయంలో జగన్ అనుసరిస్తున్న వైఖరిని రెడ్డి సోదరులు నిశితంగా గమనిస్తున్నారు.

ప్రస్తుతం ఉన్న అంచనా మేరకు, నిన్న మొన్నటి వరకు జగన్‌ను ఏదో విధంగా మద్దతు పలకాలనుకున్న రెడ్డి నాయకులు, ఇటీవల ఆయన రాజధాని విషయంలో చేసిన వ్యాఖ్యలతో మళ్లీ వెనక్కి తగ్గారు. ప్రస్తుతం అమరావతి రాజధానిగా ప్రకటించిన నేపథ్యంలో రెడ్డి నాయకులు, వ్యాపారులు కూడా పుంజుకునే అవకాశం ఉందని అంచనా వేసుకున్నారు. తద్వారా వ్యాపారాలు ముందుకు సాగుతాయని అనుకున్నారు. చాలా ప్రాంతాలకు చెందిన రెడ్లలో రియల్ ఎస్టేట్ వ్యాపారులు అమరావతిలో భూములు కొనుగోలు చేశారు.

గత వైసీపీ హయాంలో ఏర్పడిన ఇబ్బందులతో వారు తీవ్రంగా నష్టపోయారు. ఇక, ఇప్పుడు అమరావతికి చట్టబద్ధత కల్పించిన నేపథ్యంలో తమ వ్యాపారాలు పుంజుకుంటాయని అంచనా వేసుకున్నారు. అయితే, జగన్ మళ్లీ తాను వస్తే దీనిని మార్చేయడం చిటికెలో పని అంటూ తేల్చేసిన నేపథ్యంలో ఇక జగన్ వైపు ఎందుకు ఉండాలన్న నిర్ణయం దిశగా రెడ్లు అడుగులు వేస్తున్నారు. వాస్తవానికి ప్రాథమిక నష్టం వస్తే ఎవరైనా కొంత మేరకు తట్టుకుంటారు.

కానీ, దీర్ఘకాలిక నష్టం వస్తుందనే తెలిస్తే ఎవరూ సహించరు. ఇప్పుడు జగన్ విషయంలో రెడ్ల ఆలోచన కూడా అలానే ఉంది. వైసీపీ హయాంలో కాంట్రాక్టులు చేసిన వారు ఇప్పటికీ అలమటిస్తున్నారు. ఇప్పుడు కొంత మేరకు పుంజుకునేందుకు అవకాశం ఉన్న నేపథ్యంలో దానిని కూడా జగన్ వ్యతిరేకిస్తున్న తీరుతో వారు తీవ్రంగా మండిపడుతున్నారు. వైఎస్ ఫ్యామిలీ అనే అభిమానం కూడా తమకు సన్నగిల్లుతోందని ప్రముఖ రెడ్డి కాంట్రాక్టర్ ఒకరు వ్యాఖ్యానించడం సంచలనంగా మారింది.