ఊపిరి పీల్చుకున్న గులాబీ

అసెంబ్లీ నుంచి పంచాయ‌తీ ఎన్నిక‌ల వ‌ర‌కు.. తీవ్ర‌స్థాయిలో దెబ్బ‌తిన్న ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం బీఆర్ఎస్‌కు .. తాజాగా రెండు మునిసిప‌ల్ చైర్మ‌న్ పీఠాలు ద‌క్క‌డం ఆ పార్టీకి ఒకింత ఆక్సిజ‌న్ ఇచ్చే ప‌రిణామంగా మారింది. రెండు మునిసిపాలిటీల్లో బీఆర్ఎస్ పార్టీ కి చెందిన నాయ‌కులు.. ప‌ద‌వులు ద‌క్కించుకున్నారు. వీటిలో 1) ఇబ్ర‌హీంప‌ట్నం. 2) కీల‌క‌మైన క్యాత‌న్‌పల్లి. తాజాగా ఈ రెండు స్థానాల్లో చైర్మ‌న్‌, వైస్ చైర్మ‌న్ ప‌ద‌వులకు ఎన్నిక‌లు నిర్వ‌హించారు.

రెండు మాసాల కింద‌ట జ‌రిగిన స్థానిక ఎన్నిక‌ల్లో ఈ రెండు చోట్ల కూడా బీఆర్ఎస్ స‌త్తా చాటుకుంది. అయితే.. మ‌ధ్యలో రిజ‌ర్వేష‌న్ ర‌గ‌డ చోటు చేసుకుని చైర్మ‌న్‌, వైస్ చైర్మ‌న్ ఎన్నిక‌లు ఆల‌స్య‌మ‌య్యాయి. తాజాగా శ‌నివారం నిర్వ‌హించిన ఎన్నిక‌ల్లో బీఆర్ఎస్ తీవ్ర ఉత్కంఠ మ‌ధ్య విజ‌యం ద‌క్కించుకుంది. రంగారెడ్డి జిల్లా ఇబ్ర‌హీంప‌ట్నం మునిసిపాలిటీలో సంఖ్యాబలం ఎక్కువ ఉండ‌డంతో బీఆర్‌ఎస్ చైర్మన్ పదవి సొంతం చేసుకుంది. ఆ పార్టీ త‌ర‌ఫున సుద‌ర్శ‌న్ రెడ్డి విజ‌యం ద‌క్కించుకున్నారు.

ఆకుల యాదగిరి కాంగ్రెస్ అభ్య‌ర్థిగా ఉన్న‌ప్ప‌టికీ.. ఆయ‌న చివ‌రి నిముషంలో ఎన్నిక‌ల‌కు దూర‌మ‌య్యారు. మెజారిటీ కౌన్సిలర్ల మద్దతు సుదర్శన్ రెడ్డికే ద‌క్కింది. బీజేపీ అభ్య‌ర్థి(కాంగ్రెస్ బ‌హిష్క‌ర‌ణ‌తో) ముత్యాల శ్యామ‌ల భాస్క‌ర్ వైస్ చైర్మ‌న్ ప‌ద‌విని సొంతం చేసుకున్నారు.

ఇక‌, మంచిర్యాల జిల్లాలోని కీల‌కమై `క్యాతన్‌పల్లి` మున్సిపాలిటీలో కూడా బీఆర్‌ఎస్ పైచేయి సాధించింది. శనివారం జ‌రిగిన చైర్మ‌న్ ఎన్నిక‌లో క్యాతన్‌పల్లి మున్సిపల్ ఛైర్మన్‌గా బీఆర్‌ఎస్ కౌన్సిలర్‌ సంధ్యారాణి, వైస్‌ ఛైర్మన్‌ పదవిని బీఆర్‌ఎస్ మిత్ర పక్షం సీపీఐకి చెందిన సరితకు దక్కింది. దీంతో కీల‌క‌మైన రెండు స్థానాల్లోనూ బీఆర్ ఎస్ విజ‌యం ద‌క్కించుకున్న‌ట్టు అయింది.