గీత దాటితే వేటు వేస్తా.. బాబు డెడ్లీ వార్నింగ్

పదవుల కోసం తన చుట్టూ తిరగడం కాదని, ప్రజల చుట్టూ తిరగాలని టీడీపీ ఎమ్మెల్యేలకు చంద్రబాబు హితబోధ చేశారు. క్షేత్రస్థాయిలో బాగా పనిచేస్తేనే పార్టీలో, ప్రభుత్వంలో ప్రాధాన్యత పెరుగుతుందని అన్నారు. భవిష్యత్తులో వచ్చే ప్రతి ఎన్నికల్లోనూ టీడీపీకి ఓటింగ్ శాతం పెరిగితేనే నేతలు బాగా పనిచేసినట్టని చెప్పారు. ఈ క్రమంలోనే కొందరు టీడీపీ ఎమ్మెల్యేల తీరుపై ఆయన ఫైర్ అయ్యారు.  

నరసరావుపేట ఎమ్మెల్యే అరవిందబాబు వ్యవహారంపై సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. ఆయనతోపాటు పార్టీలోని మరికొందరు నేతల ప్రవర్తన, తీరుపై ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. గీత దాటితే వేటు వేస్తానంటూ డెడ్లీ వార్నింగ్ ఇచ్చారు. వన్ టైమ్ ఎమ్మెల్యేగా మిగిలిపోవాలనుకుంటున్నారా? తేల్చుకోండి అంటూ కొందరు ఎమ్మెల్యేలనుద్దేశించి తీవ్రస్థాయిలో హెచ్చరించారు. కొందరు ఎమ్మెల్యేల వ్యక్తిగత ప్రయోజనాల కోసం పార్టీని పణంగా పెట్టే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. పార్టీకి, ప్రభుత్వానికి చెడ్డపేరు తెస్లే సహించబోనని హెచ్చరించారు.

నరసరావుపేట జిల్లా పోలీస్ కార్యాలయ న్యాయ సలహాదారుడిగా తాను చెప్పిన వ్యక్తిని నియమించలేదని పల్నాడు జిల్లా ఎస్పీని నరసరావుపేట ఎమ్మెల్యే అరవింద బాబు బెదిరించారని ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. ఎస్పీ తన మాట వినకపోవడంతో ఎస్పీ కార్యాలయంలోని బాత్‌రూమ్‌లోకి దూరి అరవిందబాబు నానా రభస చేశారు. పోలీసులు వచ్చి బాత్‌రూమ్ తలుపులు బద్దలు కొట్టి మరీ అరవిందబాబును బయటికి తీసుకువ‌చ్చారు. చివరకు అరవిందబాబు చెప్పిన వ్యక్తికే అపాయింట్మెంట్ ఆర్డర్ ఇస్తామని గుంటూరు ఐజీ హామీ ఇవ్వడంతో ఆ కథ ముగిసింది. 

ఈ క్రమంలోనే ఓ సభలో మాట్లాడుతూ ఈ విషయంపై సీఎం చంద్రబాబు కూడా స్పందించారు. మా ఎమ్మెల్యే ఒకరు వెళ్లి వేరే ఆఫీసు మీద పడ్డారు…అంటూ చంద్రబాబు చేసిన కామెంట్లు వైరల్ అయ్యాయి. ఈ నేపథ్యంలోనే ఈ రోజు అరవిందబాబుతోపాటు క్రమశిక్షణ లేని కొందరు టీడీపీ నేతలకు చంద్రబాబు డెడ్లీ వార్నింగ్ ఇచ్చారు.