ఇంకో మెట్టు ఎక్కేసావయ్యా లోకేష్

ఎంత ఎదిగినా.. ఒదిగి ఉండ‌డంలోనే అస‌లైన గౌర‌వం, మ‌ర్యాద ఉంటాయ‌ని మ‌రోసారి ఏపీ మంత్రి, టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్ చాటి చెప్పారు. త‌ర‌చుగా ఆయ‌న ఆడంబ‌రాల‌కు పోకుండా.. సాధార‌ణ నాయ‌కుడిగానే వ్య‌వ‌హ‌రిస్తున్నారు. నిజానికి ఇటు పార్టీ ప‌రంగా చూసుకున్నా.. అటు ప్ర‌భుత్వ ప‌రంగా చూసుకున్నా.. లోకేష్ ఉన్న‌త‌స్థానంలోనే ఉన్నారు. ముఖ్య‌మంత్రి కుమారుడిగానే కాకుండా..మంత్రిగా(నాలుగు శాఖ‌ల‌కు) ఆయ‌న వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఇక‌, రాష్ట్రంలో అతి పెద్ద పార్టీ టీడీపీకి ఆయ‌న జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి(నెంబ‌రు 2)గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు..

నిత్యం వంద‌ల మంది నాయ‌కులు, వేల మంది కార్య‌క‌ర్త‌లు ఆయ‌న చుట్టూ ఉంటారు. ఇక‌, ప్ర‌భుత్వ ప‌రంగా ప‌దుల సంఖ్య‌లో ఉన్న‌తాధికారులు కూడా నారా లోకేష్ క‌నుస‌న్న‌ల్లోనే ప‌నిచేస్తున్నారు. ఇంత పోర్టు ఫోలియో ఉన్నా కూడా.. లోకేష్‌.. త‌న‌ను తాను త‌గ్గించుకుని వ్య‌వ‌హ‌రిస్తూ.. నేటి యువ‌తకు ముఖ్యంగా చిందులు తొక్కే నాయ‌కుల‌కు కూడా ఆద‌ర్శంగా నిలుస్తున్నారు.

ఇలా.. త‌న‌ను తాను ఎప్ప‌టిక‌ప్పుడు సాధార‌ణ‌, సామాన్య నాయ‌కుడిగానే ప్రొజెక్టు చేసుకుంటూ.. విన‌యం పాటిస్తున్నారు. తాజాగా క‌ర్ణాట‌క‌లో ప‌ర్య‌టించిన నారా లోకేష్‌.. సింధ‌నూరులో నిర్వ‌హించిన ఎన్టీఆర్ విగ్ర‌హావిష్క‌ర‌ణ వేడుక‌లో పాల్గొన్నారు. ఈ కార్య‌క్ర‌మంలో కేంద్ర మంత్రి కుమార స్వామి కూడా పాల్గొన్నారు. అయితే.. మంత్రి లోకేష్ గౌర‌వార్థం.. వేదిక‌పై ఆయ‌న‌కు పెద్ద‌సీటును ప్ర‌త్యేకంగా వేశారు. దానికి పక్క‌న చిన్న‌స్థాయి కుర్చీల‌ను వేశారు. చిన్న‌పాటి కుర్చీల్లో కేంద్ర మంత్రి, రాష్ట్రానికి చెందిన ఇత‌ర మంత్రులు కూర్చున్నారు.

లోకేష్ కోసం ప్ర‌త్యేకంగా వేసిన పెద్ద సీటులో ఆయ‌న‌ను కూర్చోబెట్టాల‌ని భావించారు. కానీ, లోకేష్ మాత్రం.. దీనికి అంగీక‌రించ‌లేదు. ఆ సీటుకు న‌మ‌స్కారం చేస్తూ.. తాను ఇంకా అంత పెద్ద వాడిని కాలేద‌ని.. ఈ స‌భ‌లో త‌న‌కంటే సీనియ‌ర్లు.. పెద్ద‌వారు చాలా మంది ఉన్నార‌ని.. చెబుతూ.. కుమార‌స్వామిని అందులో కూర్చోవాల‌ని రిక్వెస్ట్ చేశారు.

కానీ, కుమార స్వామి అంగీక‌రించ‌లేదు. దీంతో ఇరువురి మ‌ధ్య రెండు నిమిషాల‌పాటు.. ఈ విష‌యంలో రిక్వెస్టులు కొన‌సాగాయి. చివ‌ర‌కు లోకేష్ అభ్య‌ర్థ‌న మేర‌కు పెద్ద‌సీటును తీసేసి.. చిన్న సీటు వేశారు. అనంత‌రం.. స‌భ‌ను కొన‌సాగించారు. లోకేష్ విన‌యానికి.. స‌భికులు ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేశారు.