తెలుగు రాష్ట్రాల మధ్య మరోమారు నీటి పంచాయతీ నెలకొంది. ఈ సందర్భంగా ఏపీ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటు తీవ్ర ఆవేదనను వ్యక్తం చేసిన తెలంగాణ ఏకంగా ధర్నాకు దిగిందట. పొరుగు రాష్ట్రం ధర్నాకు దిగిన తర్వాత గానీ ఏపీ తన తప్పును తెలుసుకుని వ్యవహరించిందట. ఈ మేరకు తెలంగాణలోని ఉమ్మడి పాలమూరు జిల్లాకు చెందిన టీ మంత్రి జూపల్లి కృష్ణారావు ఏపీకి ఓ రేంజిలో వార్నింగ్ ఇచ్చారు. తమకు అన్యాయం జరిగితే ఇకపై చూస్తూ ఊరుకోబోమని ఆయన ఏపీకి వార్నింగ్ కూడా ఇచ్చారు.
గోదావరి జలాలపై తెలుగు రాష్ట్రాల మధ్య పెద్దగా పంచాయతీ లేకున్నా… కృష్ణా నదీ జలాల పంపిణీపై ఇరు రాష్ట్రాల మధ్య ఎప్పటికప్పుడు వివాదాలు చెలరేగుతూనే ఉన్నాయి. దిగువన ఉన్న ఏపీ.. ఇష్టారాజ్యంగా నీటిని వినియోగిస్తున్న కారణంగానే ఈ వివాదాలు పుట్టుకొస్తున్నాయని తెలంగాణ వాదిస్తూ ఉంటే… దిగువన ఉన్న రాష్ట్రంగా తాము నిరుపయోగంగా సముద్రంలో కలుస్తున్న నీటిని కూడా వినియోగించుకునే హక్కు లేదా? అంటూ ఏపీ వాదిస్తోంది. మొత్తంగా కృష్ణా జలాలపై జరుగుతున్న ఈ నీటి వివాదాలు ఎప్పటికప్పుడు ఇరు రాష్ట్రాల మధ్య ఉద్రిక్త వాతావరణానికి దారి తీస్తున్నాయి.
తాజాగా వచ్చిన వివాదంలోకి వెళితే… శ్రీశైలం ప్రాజెక్టు వద్ద నిర్ణీత నిల్వ వరకే విద్యుత్ వినియోగాన్ని చేపట్టాలి. అయితే ఈ దఫా ఏపీ ఆ నిల్వ పరిమితి సమీపించినా… విద్యుత్ వినియోగాన్ని ఆపలేదట. ఇదే విషయాన్ని చెప్పినా ఏపీ వినడం లేదని తెలంగాణ ఆరోపిస్తోంది. అయితే కేవలం తాగు నీటి అవసరాలకే నీటిని వినియోగించాల్సి ఉందని. ఈ పరిమితి దాటి విద్యుత్ వినియోగం ఎలా చేపడతారంటూ తెలంగాణకు చెందిన ప్రజలు ప్రాజెక్టు వద్ద ధర్నాకు దిగారట.
తెలంగాణ ధర్నాతో పరిస్ఠితి ఉద్రిక్తంగా మారుతోందని గ్రహించిన ఏపీ అప్పటికప్పుడు విద్యుత్ వినియోగాన్ని నిలిపివేసిందట. వాస్తవంగా ఆ పరిమితి దాటి విద్యుత్ వినియోగానికి నీటిని కిందకు వదిలితే… తెలంగాణలోని ఉమ్మడి పాలమూరు జిల్లా నీటి అవసరాలు ప్రమాదంలో పడతాయట.
ఇంతటి ప్రాధాన్యం కలిగిన విషయాన్ని కూడా మరిచిన ఏపీ యధేచ్ఛగా విద్యుత్ వినియోగం చేపట్టిందని జూపల్లి ఆరోపిస్తున్నారు. ఇకపై ఈ రీతిన ఏపీ వ్యవహరిస్తే సహించేది లేదని కూడా ఆయన ఘాటుగా స్పందించారు. మరి నీటి వినియోగంలో ఇప్పటికైనా కేఆర్ఎంబీ మార్గదర్శకాలను ఇరు రాష్ట్రాలు పాటించాల్సిన అవసరం ఉందన్న వాదన అయితే బలంగా వినిపిస్తోంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates